తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర

Mar 14 2025 1:00 AM | Updated on Mar 14 2025 12:57 AM

–8లో

నిద్ర కరువైతే అనారోగ్యం..!

అధికంగా మొబైల్‌ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం/గజపతినగరం రూరల్‌: సాక్షాత్తూ మంత్రి కొండపల్లి శ్రీనువాస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం.. ఆయన తండ్రి కొండబాబు కనుసన్నల్లో నడుస్తున్న యంత్రాగం.. వారు కోరితెచ్చుకున్న అధికారులు.. ఇదే అదనుగా టీడీపీ నాయకులు కొందరు చంపావతి నదిని చెరబట్టారు. ఇసుకాసురులతో చేతులు కలిపి ఇసుక మేటలను కొల్లగొడుతున్నారు. రాత్రీ పగలు తేడాలేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. తవ్వినంత ఎత్తిపోసుకోవడానికి వీలుగా ఉన్న కూటమి ప్రభుత్వ నూతన ఇసుక విధానం వారికి అన్నివిధాలా కలిసి వస్తోంది. అదే సాకుతో అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఫలితం ఇసుకను దోచుకుంటున్నవారు కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వారికి అనుకూలమైన అధికారులకు ఆమ్యామ్యాలు ముడుతున్నాయనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. చంపావతి నది మాత్రం ఇసుకాసురుల కబంధహస్తాల్లో చిక్కి రూపురేఖలే కోల్పోతోంది. వరద సమయంలో రక్షణగా ఉండే కట్టలు కరిగిపోతుండడం తీర ప్రాంత ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. దాహం తీరుస్తున్న రక్షిత మంచినీటి పథకాలకు పెను ప్రమాదం పొంచి ఉంది.

అనుమతి లేకుండానే తవ్వకాలు

గజపతినగరం మండలంలో వాస్తవానికి ఎక్కడా అధికారికంగా ఇసుక ర్యాంపులకు అనుమతి లేదు. కానీ చంపావతికి ఉపనది ఏడొంపుల గెడ్డలో తొలుత ఇసుక తవ్వకాలు మొదలెట్టారు. ఎం.గుమడాం, లింగాలవలస గ్రామాల వద్ద ఇష్టారీతిలో తవ్వేస్తున్నారు. రోజుకు కనీసం 150 ట్రాక్టర్ల ఇసుకను తరలించేస్తున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు. తర్వాత ఇదే మండలం పరిధిలోనున్న చంపావతి నదీ పరివాహక ప్రాంతాలైన మర్రివలస, చిట్టేయవలస, కొణిశ, గంగచోళ్లపెంట, పట్రువాడ, దావాలపేట, పురిటిపెంట, లోగిశ, సీతారామపురం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వేస్తున్నారు.

లారీలకు లోడులెత్తి...

ట్రాక్టర్లతో తెస్తున్న ఇసుకను గజపతినగరం పరిసర ప్రాంతాల్లో కుప్పలేస్తున్నారు. రాత్రిపూట ఆ ఇసుకను లారీలకు ఎత్తి విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ ఇసుకకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది లాభసాటిగా ఉండడంతో టీడీపీ నాయకులు ఇసుకాసురులతో చేతులు కలిపి ప్రకృతిని, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు.

గజపతినగరం నియోజకవర్గంలో

భారీఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు

టీడీపీ నాయకుల అండదండలతో

చెలరేగుతున్న అక్రమార్కులు

నిలువెత్తు గోతులతో చిధ్రమవుతున్న

నదీ తీరం

కరిగిపోతున్న ఇరువైపులా కట్టలు

కొద్ది రోజుల్లోనే రూ.కోట్లకు పడగలెత్తిన ఇసుకాసురులు

కన్నెత్తి చూడని ప్రభుత్వాధికారులు

అధికారుల ఉదాసీనత...

కళ్ల ముందే ఇసుక ట్రాక్టర్లతో ఇష్టానుసారం తరలిపోతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. రెవెన్యూ, పోలీస్‌ శాఖల్లోనూ ఎక్కువ మంది టీడీపీ నేతలు కోరితెచ్చుకున్నవారే కావడంతో వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇసుక దోపిడీదారులకు కలిసివస్తోంది. కొంతమంది అధికారులకూ దండిగా మామ్మూళ్లు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఎవరైనా అధికారి అడ్డగించినా వారిపై స్థానిక ప్రజాప్రతినిధి తండ్రికి ఫిర్యాదులు వెళ్లిపోతున్నాయట. ఇప్పటికై నా ఇసుక దోపిడీని నియంత్రించకపోతే చంపావతి భవిష్యత్తులో చంపేనది అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర 1
1/3

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర 2
2/3

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర 3
3/3

తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement