
గంట్యాడ: మండలంలోని బుడతానపల్లి గ్రామానికి చెందిన దాసరి శ్రీను (26) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరామనవమి సందర్బంగా పొరుగు గ్రామంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు శ్రీను బైక్‌పై గురువారం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం పెణసాం జంక్షన్ వద్ద శ్రీను చనిపోయి పడి ఉండడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటాడని అందరూ భావించారు. అయితే కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీను తల్లిదండ్రులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై, తలపైన గాయాలు ఉండడంతో తన కొడుకు భార్య, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వారిద్దరూ కలిసి తమ కొడుకును హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వచ్చిన సీఐ తిరుపతిరావు, ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు సంఘట స్థలాన్ని, మృత దేహాన్ని పరిశీలించారు. హతుడు శ్రీను స్వస్థలం వేపాడ మండలంలోని సోంపురం. అత్తవారి ఊరైన బుడతానాపల్లి గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. మృతుడికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
కొత్తవలస: అనారోగ్యం కారణంగా మనస్తాపానికి గురైన మండలంలోని దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన నక్క శ్రీను(48) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ ఎస్.బాలసూర్యారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీను కొద్ది రోజులుగా మెదడుకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజూమున బాత్‌రూమ్‌లోకి వెళ్లి అప్పటికే అక్కడ దాచుకున్న పెట్రోల్‌ను వంటి మీద పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు.గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ఒక పాప, బాబు ఉన్నారు.
పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం/సీతానగరం: మద్యం తాగవద్దని తండ్రి మందలించినందుకు మనస్తాపం చెందిన సీతానగరం మండలం బుడ్డిపేట గ్రామానికి చెందిన బి. నాగరాజు పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సీతానగరం పీహెచ్‌సీకి చికిత్సకోసం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోడలు, ప్రియుడు కలిసి చంపేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

పార్వతీపురం: చికిత్స పొందుతున్న నాగరాజు

మృతుడు శ్రీను (ఫైల్)

కొత్తవలస: ఆత్మహత్యకు పాల్పడిన శ్రీను (ఫైల్)