
పరీక్ష కేంద్రం గేటు ముందు నిరీక్షిస్తున్న విద్యార్థిని
రాజాం సిటీ: ప్రమాదానికి గురై పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్లిన ఓ విద్యార్థిని అక్కడి చీఫ్ అనుమతించకపోవడంతో చేసేదేమీలేక ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్ ఫస్టియర్ ఆఖరు పరీక్షకు రేగిడి మండలం సోమరాజుపేట గ్రామానికి చెందిన విద్యార్థిని వస్తున్న ఆటో మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే అదే ఆటోలో రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను బాబానగర్‌లోని గాయత్రి కళాశాలలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఇచ్చిన గడువు కంటే 25 నిమిషాలు ఆలస్యం కావడంతో చీఫ్ సూపరింటెండెంట్ ఆమెను పరీక్షకేంద్రంలోకి అనుమతించలేదు. ప్రమాదానికి గురయ్యాయనని, ఆస్పత్రికి సంబంధించిన పేపర్లు చూపించి ప్రాథేయపడినా అనుమతించకపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా తామేమీ చేయలేమని చీఫ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ తెలిపారు.