తీరానికి కాలుష్య గండం | - | Sakshi
Sakshi News home page

తీరానికి కాలుష్య గండం

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

సముద్రాన్ని మింగేస్తున్న మురుగు కాల్వలు, పరిశ్రమలు

దక్షిణ తీరం కలుషితానికి 41.6 శాతం డ్రైన్లే కారణం

కాలుష్య కేంద్ర బిందువులుగా విశాఖ అర్బన్‌, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలు

ఈ ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు పైనే నమోదు

సర్వే నివేదికలో స్పష్టం చేసిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌

నీలి సముద్రపు అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో దక్షిణ తీర ప్రాంత పర్యావరణం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జాతీయ దూరస్పందన కేంద్రం శాస్త్రవేత్తలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. –సాక్షి, విశాఖపట్నం

సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణాలు

పెద్ద డ్రైన్లు, గెడ్డలు – 41.6 శాతం

పరిశ్రమలు, పోర్టులు – 23.7 శాతం

అంతర్గత కాలువలు – 33.2 శాతం

ఇతర కారణాలు – 1.5 శాతం

‘మురుగు’తోనే ముప్పు ఎక్కువ

తీర ప్రాంత సముద్ర కాలుష్యానికి నగరంలోని మురుగునీటి కాలువలు, డ్రైన్లే ప్రధాన కారణంగా మారాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కాలుష్యంలో సుమారు 41.6 శాతం వాటా మురుగునీటి ప్రవాహాలదేనని పరిశోధకులు గుర్తించారు. జీవీఎంసీ పరిధిలోని అనేక కాలువలు, గెడ్డల ద్వారా ప్రతిరోజూ భారీగా మురుగునీరు సముద్రంలోకి చేరుతోంది. నిబంధనల ప్రకారం ఈ నీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. నగర పరిధి, పెదగంట్యాడ, గాజువాక ప్రాంతాలు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూపరితల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఏర్పడుతున్న ‘ఉష్ణ ద్వీప’ పరిస్థితులు పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు.

పగ్రహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన సముద్ర కాలుష్య సూచిక ప్రకారం గంగవరం పోర్టు, విశాఖ హార్బర్‌ నుంచి గాజువాక, పెదగంట్యాడ వరకు ఉన్న దక్షిణ తీర ప్రాంతం తీవ్ర కాలుష్య ప్రభావంతో ప్రమాదకర మండలంగా మారుతున్నట్లు తేలింది. మేఘాద్రిగెడ్డ డ్రెయిన్‌ అవుట్‌లెట్‌, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ పరిసరాల్లో కాలుష్యం అధికంగా నమోదైనట్లు పరిశోధన వెల్లడించింది. సముద్ర జలాల నాణ్యత క్షీణించడంతో పాటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సముద్రపు నీటిలో పెరిగిన క్లోరోఫిల్‌–ఏ

కాలుష్య కాసారాలుగా మారిన ఈ ప్రాంతాల్లోని సముద్రపు నీటిలో క్లోరోఫిల్‌–ఏ సాంద్రత, లవణీయత, నీటి కాలుష్య సాంద్రత, ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లోరోఫిల్‌–ఏ సాంద్రత పెరిగిపోతే.. సముద్రంలో నాచు దట్టంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఆల్గల్‌ బ్లూమ్‌ అని పిలుస్తారు. దీనివల్ల నాచు కుళ్లిపోయి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ని పూర్తిగా లాగేసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్‌ కొరత ఏర్పడి చేపలు, ఇతర సముద్ర జీవులు ఊపిరాడక మృత్యువాత పడతాయి. ఇలాంటి ప్రాంతాల్ని డెడ్‌జోన్లుగా పిలుస్తారు.

ప్రభుత్వం పట్టించుకోకుంటే కష్టమే

కాలుష్య ప్రాంతాలుగా మారుతున్న తీరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి. జీవీఎంసీ, ఏపీపీసీబీ అధికారులు హాట్‌స్పాట్లను గుర్తించి తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా కట్టడి చేయకపోతే.. భవిష్యత్తులో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని పరిశోధన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement