రాజకీయ కక్షలకే ప్రాధాన్యం?
వర్సిటీని బలహీనపరచడమే లక్ష్యమా?
కూటమి వర్గాల్లో అంతర్మథనం
ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులు, విద్యార్థి సంఘాలు
విశాఖ విద్య: వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రస్తుతం విద్యా, పరిశోధన అంశాల కంటే రాజకీయ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత విభేదాలే ప్రధాన చర్చగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ వైస్ చాన్సలర్, గత పాలకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తరచూ ఆరోపణలు చేయడం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనివల్ల ఏయూ ప్రతిష్ట దెబ్బతింటోందని ఉద్యోగులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఇద్దరి బాధ ఏమిటి?
ఏయూ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. పోస్టింగులు, పదోన్నతులు, పరిపాలనా నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం అధికమైందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ భవిష్యత్తు కంటే గత పాలకవర్గంపై విమర్శలకే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు స్పష్టంగా లేకపోయినా విచారణలు జరపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది. తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వానికే నష్టం చేస్తుందని కూటమి వర్గాల్లోనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గోతికాడ గుంటనక్కలా...
ఏయూ ప్రతిష్ట దెబ్బతింటే తమ విద్యాసంస్థలకు లాభం చేకూరుతుందనే ఆలోచనతో మరో ప్రజాప్రతినిధి, టీడీపీకి చెందిన కీలక నేత వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా యూనివర్సిటీ వర్గాల్లో సాగుతోంది. ఏయూకు సంబంధించిన ప్రతి వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ ర్యాంకింగ్స్, గుర్తింపుల విషయంలో ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న యూనివర్సిటీపై బయటకు ఆందోళన వ్యక్తం చేస్తూనే, లోలోపల దాని బలహీనతలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలోని కొందరు వర్గాలు కూడా అలాంటి ప్రయత్నాలకు సహకరిస్తున్నాయనే ప్రచారం కొనసాగుతోంది.
కాపాడతారా... రాజకీయాలకు బలి చేస్తారా?
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ఆంధ్రా యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సంస్థపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు, ప్రయోజనాల రాజకీయాలు ప్రభావం చూపడం పట్ల మాజీ ఆచార్యులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని, తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదని హెచ్చరిస్తున్నారు. విద్యా సంస్థలను రాజకీయాలకు బలి చేయకుండా వాటి అభివృద్ధి, ప్రతిష్ట పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తప్పులెంచువారు..
ఏయూ వ్యవహారాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత మేరకు సఫలమయ్యారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే విషయంలో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యేపై కూడా ప్రజల కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అసంతృప్తులతో ఏయూనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాసంస్థలను రాజకీయ పోరాటాలకు వేదికలుగా మార్చడం వల్ల నష్టపోయేది విద్యార్థుల భవిష్యత్తేనని వారు హెచ్చరిస్తున్నారు.


