యోగా దినచర్య కావాలి | - | Sakshi
Sakshi News home page

యోగా దినచర్య కావాలి

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

మహారాణిపేట: ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ వర్షం కారణంగా ఆర్కే బీచ్‌లో జరగాల్సిన ఈ వేడుకను సాగరిక ఫంక్షన్‌ హాల్‌కు మార్చి ఘనంగా జరిపారు. హోంమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సామూహిక యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, ముఖ్యంగా చిన్నారుల్లో పెరుగుతున్న డిప్రెషన్‌ను తగ్గించడానికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో ఈ ఏడాది నెల రోజులుగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నేవీ సహకారంతో పాటు రుషికొండ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌, గోల్ఫ్‌ క్లబ్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు వివరించారు. అనంతరం జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు, యోగా గురువులకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.

ఆంధ్ర యూనివర్సిటీ యోగా విభాగం విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవో దిలీప్‌ చక్రవర్తి, డీఎఫ్వో రవీందర్‌ ధామా, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, వెంకటరత్నం, యోగా అసోసియేషన్‌ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంగా యోగా డే

విశాఖ పోర్ట్‌ ఆధ్వర్యంలో..

మహారాణిపేట: విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం అక్కయ్యపాలెంలోని పోర్ట్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో 500 మందికి పైగా ఉద్యోగులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పోర్ట్‌ చైర్‌పర్సన్‌ జె.ఎస్‌.బింద్రా మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారాలని సూచించారు. బెంగళూరు ఆశ్రమానికి చెందిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా గురువు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్‌ ఉద్యోగులతో వివిధ యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు, ధ్యాన ప్రక్రియలను సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోష్ని అపరంజి కోరటి, ముఖ్య విజిలెన్స్‌ అధికారి టి.అరుణ్‌ప్రసాద్‌, కార్యదర్శి ఎం.శంకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సింహగిరిపై యోగాసనాలు

సింహాచలం: సింహగిరిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ప్రారంభించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, సంస్కృతోన్నత పాఠశాల, వేద విద్యార్థులు, సేవా వలంటీర్లు, భక్తులు సుమారు వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వేదికపై దేవస్థానం వేదపాఠశాల విద్యార్థులు వేసిన ‘సూర్యరథం’ ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా గురువు జి.వెంకటరమణ, యోగా శిక్షకురాలు శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement