మధురవాడ: అధికారుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మధురవాడ సమీపంలోని సాయిరాం కాలనీ జీసీసీ లేఅవుట్‌లో విద్యుత్ షాక్‌తో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి ఉపాధి కోసం విశాఖకు వచ్చిన కురిటి నారాయణరావు, చిన్నమ్మలు దంపతులు సాయిరాం కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొడుకు కురిటి అఖిల్(6) స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.
బంతి కోసం వెళ్లి... అనంత లోకాలకు!
ఆదివారం ఉదయం అఖిల్ తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బంతి ప్రమాదవశాత్తు ‘శ్రీ రేణుక అపార్ట్‌మెంట్’ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ పైపుల వద్దకు వెళ్లింది. బంతిని తెచ్చేందుకు అఖిల్ అక్కడికి వెళ్లగా, తెగిపోయి బయటకు ఉన్న వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
యూజీడీ పనులే కారణం?
సదరు ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ పనుల వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పనుల క్రమంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ వైర్ తెగిపోయి బయటకు వచ్చేసిందని, దానివల్లే విద్యుదాఘాతం సంభవించిందని ఆరోపిస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్యామ్‌బాబు, ఈఈ సింహాచలం నాయుడు, డీఈ కిరణ్‌కుమార్ తదితరులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. యూజీడీ కేబుల్ పనుల వల్లే ఎర్త్ వైర్ కట్ అయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలి
విద్యుత్ శాఖ, శ్రీ రేణుక అపార్ట్‌మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి కురిటి అఖిల్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి బాధితులతో కలిసి సాయిరాం కాలనీలోని రేణుక అపార్ట్‌మెంట్ వద్ద ధర్నా చేశారు.


