బీచ్‌రోడ్డు: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది 10 శాతం డివిడెండ్‌ను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు బ్యాంక్ చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఆదివారం సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో వీసీబీ మహాజన సభ ఘనంగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలనా, ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు తెలిపారు. బ్యాంకు లాభాల్లో డివిడెండ్ మొత్తం రూ.39.24 కోట్లుగా ఉందని, మిగిలిన లాభాలను చట్టపరమైన నిష్పత్తుల్లో ఆయా ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు రూ.66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం ఈ ఏడాది చివరకు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖ నగరం, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించి, బ్రాంచ్‌ల సంఖ్యను 68కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, సి.కృష్ణ మోహన్, ఉప్పలపాటి పార్వతీదేవి, చలసాని రాఘవేంద్ర రావు, ఎస్.నాగభూషణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


