డాబాగార్డెన్స్: ఆర్టీసీ డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఆన్–కాల్ డ్రైవర్లు, ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. రెండేళ్ల హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండి, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న పురుష అభ్యర్థులు ఆన్–కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు అర్హులని పేర్కొన్నారు. డిపోల్లో డ్రైవర్ల కొరత ఉన్న సమయంలో మాత్రమే వీరికి తాత్కాలికంగా విధులు కేటాయించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు వివిధ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి, అనుభవం కలిగిన అభ్యర్థులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్ ద్వారా వేతనాలు పొందేందుకు మొగ్గు చూపితే వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి, సమ్మతి గల అభ్యర్థులు తమ నివాసానికి సమీపంలో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్లను ఆధార్ కార్డు, ఇతర అసలు ధ్రువీకరణ పత్రాలతో నేరుగా సంప్రదించాలని ఆయన సూచించారు.


