అవినీతి రహిత పాలన మాటల్లోనేనా?
కమిషనర్ హెచ్చరికలు భేఖాతరు
అవినీతికి పాల్పడ్డ జీవీఎంసీ ఉద్యోగి అరెస్టు
టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినా.. పట్టించుకోని వైనం
డాబాగార్డెన్స్: జీవీఎంసీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని, పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తూనే, మరోవైపు కొందరు ఉద్యోగులు లంచాల దందాను కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అవినీతి నిర్మూలనకు జీవీఎంసీ ప్రత్యేకంగా 1800 4250 0009 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు నిర్భయంగా ఫిర్యాదులు చేయవచ్చని, వాటిని స్వయంగా పరిశీలిస్తానని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇటీవల ప్రకటించారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, రెవెన్యూ, యూసీడీ, హార్టికల్చర్ తదితర విభాగాల్లో పెండింగ్ ఫైళ్లను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
కమిషనర్ హెచ్చరించినా..
కమిషనర్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్నకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఏసీబీ కేసు సమాధానంగా నిలుస్తోంది. జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయం (జోన్–5)లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మురుగుటు శ్రీను, 2023లో మరణించిన ఉద్యోగి వెన్ను అప్పలనారాయణ కుటుంబానికి రావాల్సిన పెన్షన్, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఫైల్‌ను ముందుకు పంపేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉచ్చుపన్ని, బాధితుల నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో శ్రీనును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రాథమిక విచారణలో నిందితుడు మూడు రోజుల క్రితమే మరో వ్యక్తి నుంచి కూడా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఉన్నతాధికారుల హెచ్చరికలు, పారదర్శక పాలనపై ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న అంశంపై మరోసారి చర్చ మొదలైంది.
అవినీతి ఉద్యోగులపై కఠిన చర్యలు చేపట్టాలి
ప్రజలకు సేవలందించాల్సిన కార్యాలయాల్లో లంచాల కోసం వేధింపులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఫిర్యాదులపై వేగంగా స్పందించి వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.


