ఏయూకు ‘గుర్తింపు’ ముప్పు..! | - | Sakshi
Sakshi News home page

ఏయూకు ‘గుర్తింపు’ ముప్పు..!

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

ఎన్‌బీఏ గుర్తింపు కోల్పోతున్న ఏయూ?

పాలకవర్గ నిర్లక్ష్యమే కారణం

విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

కమిటీకి ‘బహుమతుల’ ఎరతో అప్పట్లో కలకలం

అధికారుల పనితీరుపై మాజీల ఆగ్రహం

విశాఖ విద్య: శతాబ్ద కాలపు ఘన చరిత్ర కలిగిన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ మసకబారుతోంది. పాలకవర్గ అలసత్వం.. విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల జాతీయ స్థాయి ప్రమాణాల గుర్తింపు అయిన ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌’ (ఎన్‌బీఏ)ను కోల్పోతుందనే వార్త విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని చిన్న చిన్న ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఎన్‌బీఏ గుర్తింపు కోసం పోటీ పడుతుంటే.. ప్రతిష్టాత్మకమైన ఏయూ మాత్రం పాలకవర్గ నిర్లక్ష్యంతో ఉన్న గుర్తింపును పణంగా పెట్టింది. ఉపకులపతి ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ నాయకత్వంలోని ప్రస్తుత యాజమాన్య వైఫల్యాలు, తాజా మూల్యాంకనంలో ప్రదర్శించిన అలసత్వమే ఈ దుస్థితికి కారణమని మాజీ ఆచార్యులు చేస్తున్న తీవ్ర విమర్శలు దుమారం రేపుతున్నాయి.

విద్యా ప్రమాణాలకు తలమానికం..

ఎన్‌బీఏ గుర్తింపు

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యా నాణ్యతను, జాతీయ ప్రమాణాలను అంచనా వేయడానికి ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ అత్యంత కీలకం. ఈ గుర్తింపు ఉన్న కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రముఖ బహుళజాతి సంస్థలు క్యాంపస్‌ నియామకాల్లో ఎన్‌బీఏ గుర్తింపు పొందిన విభాగాల విద్యార్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. అంతేకాకుండా భారతదేశంలోని ఎన్‌బీఏకు వాషింగ్టన్‌ అకార్డ్‌లో సభ్యత్వం ఉన్నందున, ఈ గుర్తింపు ఉన్న డిగ్రీలు పొందిన విద్యార్థులకు యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ రకాల పరిశోధన నిధులు, ఆర్థిక సహాయ కార్యక్రమాలకు కూడా ఈ అక్రిడిటేషన్‌ ఒక తప్పనిసరి అర్హతగా పనిచేస్తుంది.

ప్రదర్శనలో విఫలం..

నిధులపై కోత పడే ఛాన్స్‌

సాధారణంగా ఎన్‌బీఏ గుర్తింపు అనేది మొత్తం కళాశాలకు కాకుండా సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌ వంటి నిర్దిష్ట విభాగాలకు విడివిడిగా మంజూరు చేయబడుతుంది. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌ విభాగాలు ఇటీవల వరకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును కలిగి ఉండేవి. అయితే 2025 మధ్యకాలంలో జరిగిన తాజా మూల్యాంకన ప్రక్రియలో, అక్రిడిటేషన్‌ కమిటీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆయా విభాగాల బలాలు, మౌలిక వసతులను సమర్థవంతంగా ప్రదర్శించడంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో విశ్వవిద్యాలయం సాధించే జాతీయ స్థాయి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌పై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

కమిటీకి బహుమతుల వివాదం

మరోవైపు అక్రిడిటేషన్‌ పరిశీలన నిమిత్తం వచ్చిన కమిటీ సభ్యులకు వర్సిటీ ప్రతినిధులు బహుమతులు అందించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తికి గురైన కమిటీ సభ్యులు, నేరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి (ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌) సభ్యులకు తమ చేదు అనుభవాలను వివరిస్తూ లేఖ రాయడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి అని తెలుస్తోంది. దానిపై ఏయూ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఈ ఎన్‌బీఏ గుర్తింపుపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీఎస్‌ఈ, ఈసీఈ వంటి కీలక విభాగాలకు తిరిగి అక్రిడిటేషన్‌ సాధించేందుకు తక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మాజీ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement