జ్యోతి వెలిగించాక ‘గెట్‌ అవుట్‌’ | - | Sakshi
Sakshi News home page

జ్యోతి వెలిగించాక ‘గెట్‌ అవుట్‌’

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

కూటమి సంబరాల్లో మహిళా నేతలకు ఘోర అవమానం 50 మందికిపైగా వేదికపై కూర్చున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, అధికారులు ఒక్క మహిళనూ వేదికపైకి పిలవని నాయకులు, అధికారులు

సాక్షి, విశాఖపట్నం : పార్లమెంట్‌లో బిల్లు వీగిపోయినా.. మహిళలంటే మాకున్న గౌరవంతో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటూ చంద్రబాబు, లోకేష్‌ మహానాడు సాక్షిగా చెప్పిన మాటల్లో నిజమెంతో.. రెండేళ్ల సంబరాల్లోనే తేలిపోయింది. భారీ వేదిక.. వేదికపై పదుల సంఖ్యలో నాయకులు. కానీ ఒక్కటంటే ఒక్క కుర్చీ మహిళకు లేకుండా పోయింది. కూటమి నేతలంతా కూడబలుక్కొని అందరి సాక్షిగా అతివలకు ఘోర అవమానాన్ని మిగిల్చారు. కూర్చున్న వేదిక ఎదురుగా మహిళలు కనిపించినా ఒక్కర్ని కూడా వేదికపై కూర్చోండని పిలవకపోవడంతో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవంలో కనీస గౌరవం కొరవడిందంటూ ఆయా పార్టీల మహిళలతో పాటు మహిళా అధికారులూ అవమానకరంగా భావించారు.

వేదికపై సుమారు 50 నుంచి 100 మందికి పైగా నేతలు కూర్చున్నారు. కానీ వీరిలో ఒక్క మహిళా నేతకూ చోటు దక్కకపోవడం బాధాకరం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ మహిళా నేతలు కూడా వేదిక కిందే కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ పార్టీలో ఇంత మంది మహిళా నేతలు ఉన్నారని గొప్పలు చెప్పుకునే కూటమి నాయకులు, వేదికపై వారికి చోటు కల్పించకపోవడం వారి నిరంకుశత్వానికి నిదర్శనం.

మహిళా జాతికిది అవమానమే.!

కేవలం వేదికపై చోటు దక్కకపోవడమే కాకుండా, సభలో కూడా మహిళలకు అవమానం ఎదురైంది. వేదికపై ఉన్న నేతలందరి కోసం కుర్చీలు వేసినప్పటికీ, వేదిక కింద ఉన్న మహిళా నేతల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వారు అలాగే కింద కూర్చోవాల్సి వచ్చింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం, కనీసం సభలో మహిళలకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై వారంతా బాధని దిగమింగుకున్నారు. జ్యోతి ప్రజ్వలన సమయంలో కొందరు మహిళలు.. వేదికపైకి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే.. వారందరినీ కిందకి దిగిపోవాలంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీ చేశారు.

ఈ ఘటనపై మహిళా నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి, వేదికపై చోటు కల్పించకపోవడం తమను అవమానించడమేనని వారు వాపోతున్నారు. వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న టీడీపీకి చెందిన ఈతలపాక సుజాత, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సర్వసిద్ధి అనంతలక్ష్మి, జనసేనకు చెందిన పసుపులేటి ఉషాకిరణ్‌, బీజేపీకి చెందిన రాష్ట్ర మహిళానేత సుహాసినీ ఆనంద్‌ సహా అనేక మంది మహిళా నేతలు ఉన్నా.. వారందరికీ రెండేళ్ల సంబరాల సందర్భంగా అవమానాన్ని బహుమతిగా అందించారు.

స్టాల్స్‌ వద్ద

విభాగాధికారుల కాపలా

బీచ్‌రోడ్డులోని ఏయూ కాన్వకేషన్‌ హాల్‌లో నిర్వహించిన విజయోత్సవాల్లో కేవలం మహిళల్నే కాదు.. ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకూ అవమానం జరిగింది. ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు చెయ్యాలంటూ అధికారుల్ని ఆదేశించారు. దీంతో.. 12 ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాల్స్‌ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ వద్ద.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయా విభాగాలకు చెందిన్న ఉన్నతాధికారుల్ని పర్యవేక్షణ కోసం ఉంచేశారు. దీంతో వారంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement