ఎన్‌ఏడీ జంక్షన్ : జీవీఎంసీ 52వ వార్డు గౌరీనగర్‌లో ఉన్న జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఓ ఉద్యోగిని లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి ప్రాంతానికి చెందిన వెన్ను అప్పలనారాయణ జీవీఎంసీ జోన్–5 పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో పనిచేసి 2023లో మృతి చెందారు. ఆయన మరణానంతరం రావలసిన పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు పశ్చిమ జోనల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆరిలోవకు చెందిన మురుగుటు శ్రీనును సంప్రదించారు. దరఖాస్తును సంబంధిత ఉన్నతాధికారులకు పంపించడం మాత్రమే తన విధి అయినప్పటికీ, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు కావాలంటే రూ.30 వేల లంచం ఇవ్వాలని శ్రీను డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు గురువారం ఆన్‌లైన్ , లిఖితపూర్వకంగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉచ్చుపన్ని, జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయంలో లంచం స్వీకరిస్తున్న మురుగుటి శ్రీనును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతని నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండు రోజుల క్రితం కూడా మరో వ్యక్తి వద్ద నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, లక్షణరావు, సుప్రియతో పాటు సిబ్బంది లోకనాథం, సాగర్ పాల్గొన్నారు.


