వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్
మహారాణిపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆ పార్టీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గత చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం అక్రమాల కేసులను మాఫీ చేసుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నాడు టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో బెల్టుషాపులతో దోచుకుంటే, వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వమే షాపులు నడిపిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇకనైనా కక్షసాధింపు చర్యలు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో యాదవ సాధికార జిల్లా అధ్యక్షుడు యడ్ల సుమన్, రాష్ట్ర బీసీ విభాగం జనరల్ సెక్రటరీ తుళ్లి చంద్రశేఖర్, బీసీ నాయకుడు చోల్లంగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


