అన్నదాత దుఃఖీభవ | - | Sakshi
Sakshi News home page

అన్నదాత దుఃఖీభవ

Jun 20 2026 12:19 AM | Updated on Jun 20 2026 12:19 AM

రైతుకు సాయంపై కూటమి ప్రభుత్వం అడ్డంకులు

వైఎస్సార్‌సీపీ హయాంలో 25,072 మంది రైతు భరోసా

కూటమి ప్రభుత్వంలో 18,573 మందికే అన్నదాత సుఖీభవ

మహారాణిపేట: రైతులకు ఇస్తున్న పెట్టుబడి సహాయంపై కూటమి సర్కార్‌ కత్తెర వేసింది. అన్నదాతల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పలు రకాల కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చి ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతలు విధించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే ఆ హామీని తుంగలోకి తొక్కేశారు. కూటమి సర్కార్‌ ఈ ఏడాది విడుదల చేసిన లబ్దిదారుల జాబితాలో వేల సంఖ్యలో అర్హులైన రైతుల పేర్లు కనపడకపోవడం గమనార్హం.

6,499 మంది రైతులకు మొండిచేయి

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18,573 మంది రైతులను మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి కిసాన్‌ పధకం కింద 18,100 మందిని అర్హులుగా తేల్చారు. అదే గత వైఎస్సార్‌సీపీ హయాంలో ‘రైతు భరోసా’ కింద ఏకంగా 25,072 మంది రైతులకు నిధులను నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కోతల వల్ల ఏకంగా 6,499 మంది లబ్ధిదారులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు.

నిబంధనల పేరిట లబ్ధిదారుల తొలగింపు

గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్‌ సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులందరినీ ఒకేలా పరిగణించి ‘రైతు భరోసా’తో పాటు అన్ని రకాల పథకాలను వర్తింపజేశారు. కానీ కూటమి ప్రభుత్వం కౌలు రైతు నిబంధన, కుటుంబంలో ఒక్కరికే లబ్ధి, పది సెంట్ల లోపు భూమి ఉన్నవారిని తొలగించడం, ఆధార్‌, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధానం కాలేదనే నెపంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ కారణాలతోనే జిల్లాలో 6,499 మంది రైతులను జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు.

నేడు రైతుల ఖాతాలో జమ

అన్నదాత సుభీభవ పథకం కింద రూ.5వేలు , పీఎం కిసాన్‌ పథకం కింద రూ. 2 వేలు నిధులు శనివారం రైతుల ఖాతలో జమ చేయనున్నారని జిల్లా వ్యవసాయాధికారి అప్పలనాయుడు తెలిపారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఆనందపురం మండలం బోని గ్రామంలో, గాజువాక పరిధిలో మంగళపాలెంలో, పెందుర్తి పరిధిలో సబ్బవరంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని, రైతులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement