సబ్బవరం: మండలంలోని అసకపల్లి–లంకెలపాలెం రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైయాష్ లోడ్‌తో వెళ్తున్న డంపర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్‌కు చెందిన దీపక్ (45) పరవాడ ప్రాంతంలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పరవాడ ఎన్‌టీపీసీ నుంచి సబ్బవరం–షీలానగర్ సాగరమాల రహదారి నిర్మాణ పనుల కోసం డంపర్ లారీలో ఫ్లైయాష్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసకపల్లి సమీపంలోని బంగారమ్మతల్లి ఆలయం మలుపు వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నలిగిపోవడంతో, అందులో చిక్కుకుపోయిన డ్రైవర్ దీపక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేబిన్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


