మా కుమార్తెను అల్లుడే చంపేశాడు | - | Sakshi
Sakshi News home page

మా కుమార్తెను అల్లుడే చంపేశాడు

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

గాయత్రి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి

ఆమె మరణంపై

అనేక అనుమానాలున్నాయి

డీసీపీ–2కి లిఖితపూర్వక ఫిర్యాదు

అన్ని ఆధారాలు భద్రపరచాలని విజ్ఞప్తి

ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే కేసు నమోదు

అల్లిపురం: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పరుపూడి రాధా గాయత్రి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీ–2 మేరీ ప్రశాంతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. గాయత్రి మరణం సహజసిద్ధమైనది కాదని, అల్లుడే పథకం ప్రకారం చంపేశాడని, ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలికితీయాలని తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్‌లు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాధా గాయత్రి, శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్‌ 8న విశాఖలో వివాహం జరిగిందని తెలిపారు. గాయత్రి గతంలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేయగా, ఇటీవల గురుగ్రామ్‌లోని ఓ సంస్థలో చేరగా, ఆమె భర్త శ్రీచరణ్‌ పుణెలోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విహారయాత్ర నిమిత్తం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి వెళ్లిన దంపతులు ఓ హోటల్‌లో బస చేసిన సమయంలో గాయత్రి మృతి చెందిందని చెప్పారు. ఆమె మరణం వెనుక అల్లుడిపై అనేక ఆరోపణలు వ్యక్తం చేశారు.

భర్త అనుమానంతో వేధింపులు

తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీచరణ్‌ భార్య గాయత్రిపై తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేసేవాడు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సమయంలో ఆమె ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వాచ్‌మ్యాన్‌ సహకారంతో పరిశీలిస్తూ, ఇంటికి వచ్చే వారిపై నిఘా పెట్టేవాడు. ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉన్నప్పటికీ గాయత్రి కదలికలను నిరంతరం గమనిస్తూ, ఆమె అనుమతి లేకుండానే హ్యాండ్‌బ్యాగ్‌లో ట్రాకింగ్‌ పరికరాన్ని కూడా అమర్చాడు. సహోద్యోగుల గురించి తరచూ ప్రశ్నిస్తూ, వివాహేతర సంబంధాలపై నిరాధార ఆరోపణలు చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడు. గురుగ్రామ్‌కు మారిన తర్వాత కూడా గాయత్రి కార్యాలయానికి వెళ్లే సమయంలో వీడియో కాల్స్‌ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. నిత్యం ఆమెను మానసికంగా వేధించేవాడు.

అన్ని ఆధారాలను పరిశీలించాలి

గాయత్రి మృతికి సంబంధించిన పరిస్థితులపై శ్రీచరణ్‌ను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదు. ఘటన జరిగిన హోటల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, రిజిస్టర్‌ వివరాలు, కాల్‌ డేటా రికార్డులు, ఇతర డిజిటల్‌ ఆధారాలను భద్రపరచి పరిశీలించాలి. పోస్టుమార్టం నివేదికలోని అంశాలను కూడా సమగ్రంగా విశ్లేషించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, గాయత్రి మృతిపై ఇప్పటికే ఉత్తరాఖండ్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి దర్యాప్తు వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement