మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో బీఎల్‌వో సుమారు వెయ్యి ఫారాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఫారాల పంపిణీతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిందో లేదో యాప్ ద్వారా నిర్ధారించుకుని పంపిణీ చేపట్టాలని తెలిపారు. గాజువాక నియోజకవర్గంలోని 181, 240 పోలింగ్ కేంద్రాలు, పెందుర్తి నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్ర పరిధిలో ఇంకా ఫారాల పంపిణీ ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించి ప్రతి కేసుకు ప్రత్యేక ఫైల్ నిర్వహించి, కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. స్టీల్‌ప్లాంట్ తదితర ప్రాంతాల్లో డోర్‌లాక్ సమస్యలు అధికంగా ఉంటే ఇతర శాఖల అధికారుల సహకారం తీసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు తదితర అధికారులు పాల్గొన్నారు.


