గాజువాక: కొత్తగాజువాక మార్కెట్ వద్ద ఉన్న ‘శివ ఫైర్ వర్క్స్’ దుకాణంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. శివ ఫైర్ వర్క్స్ దుకాణం లోపల ఐరన్ స్టాండ్ తయారు చేయడం కోసం గురువారం వెల్డింగ్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసిపడి సమీపంలోనే ఉన్న బాణసంచాపై పడ్డాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడ వెల్డింగ్ పనులు చేస్తున్న నర్సింగరావు, సూరిబాబులకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ వర్క్స్ దుకాణానికి ఇరువైపులా పలు రకాల హోల్‌సేల్ దుకాణాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


