ఆ స్పా జోలికి వెళ్లని పోలీసులు
ఫిర్యాదులు వస్తే నిర్వాహకులకు
సమాచారం?
నెల నెలా భారీ మామూళ్లే
కారణమన్న విమర్శలు
సెలూన్ పేరిట
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
సంపత్ వినాయగర్ ఆలయానికి కూతవేటు దూరంలో సెలూన్ పేరిట నడుస్తున్న ఓ స్పా సెంటర్ విషయంలో పోలీసులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ కేంద్రం జోలికి పోలీసులు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. కరోనా సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని తెరిచి ఉంచడంతో పోలీసులు దాడి చేశారు. అప్పట్లో బాడీ మసాజ్‌ల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై నిర్వాహకులు పోలీసులకు అడ్డంగా దొరికినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సెలూన్ ముసుగులో స్పా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు స్పా కేంద్రాలపై తరచూ దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ కేంద్రం వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేంద్రంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం వెంటనే నిర్వాహకులకు చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే యువతులకు సెలూన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, క్రమంగా స్పా కార్యకలాపాల్లోకి దింపుతున్నట్లు సమాచారం. వీఐపీ రోడ్డులో ఉన్న మరో సెలూన్ స్టూడియో విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి.
బయోమెట్రిక్‌తో ఎంట్రీకి అడ్డుకట్ట!
స్పా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమే. అయితే మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో మసాజ్ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం శిక్షణ పొందిన థెరపిస్టులు ఉండాలి. అయితే విశాఖపట్నంలోని కొన్ని కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మసాజ్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల కోసం పోలీసులు లేదా ఇతరులు నేరుగా లోపలికి రాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్పా సిబ్బంది మినహా ఇతరులు లోపలికి వెళ్లాలంటే బయోమెట్రిక్ కార్డు తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం. ఈ విధమైన వ్యవస్థలు ఉండకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ, వాటి వినియోగం మాత్రం కొనసాగుతూనే ఉంది. మామూళ్ల వ్యవహారమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అది స్పెషల్ స్పా
వాస్తవానికి నగరంలో స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి మసాజ్‌ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. నగరంలో అడుగడుగునా కనిపిస్తున్న స్పా కేంద్రాల్లో చాలావరకు ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంపత్ వినాయక ఆలయానికి సమీపంలోని ఈ కేంద్రంతో పాటు వీఐపీ రోడ్డులోని మరో స్టూడియోపైనా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. బయటకు సెలూన్‌లుగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల వ్యభిచారం సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం నిర్వాహకులకు చేరుతుండటంతో వారు ఫిర్యాదు చేసిన వారిని సంప్రదించి వ్యవహారాన్ని ‘మేనేజ్’ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచే..
విశాఖపట్నంలోని అనేక మసాజ్ కేంద్రాల్లో స్థానిక యువతుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొస్తున్నట్లు సమాచారం. వారికి వసతి సదుపాయాలను కూడా కొందరు నిర్వాహకులే కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సెలూన్లు, స్టూడియోల పేర్లతో అనుమతులు తీసుకుని స్పా కేంద్రాలను నిర్వహిస్తుండగా, మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో మసాజ్ కేంద్రాలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ కేంద్రాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి మామూళ్ల వ్యవహారమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి స్పాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మూసివేసిన గదులకు బదులుగా కర్టెన్లతో మాత్రమే విభజనలు ఉండాలని గతంలో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధనలను చాలా కేంద్రాలు పాటించకపోయినా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


