కూటమిలో సర్‌ కలకలం! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో సర్‌ కలకలం!

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

సొంత బంధువులు, జనసేన నేతల ఓట్లను తొలగిస్తున్నారని ఆక్షేపణ

కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేసిన

మాజీ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

హైజాక్‌ చేస్తున్నారని మండిపాటు

గుండుగుత్తగా ఫారాలు

నింపుతున్నారంటూ ఆరోపణలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తున్నారనే భయాందోళనల నడుమ ప్రారంభమైన ’స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–2026 (ఎస్‌ఐఆర్‌)’ ప్రక్రియ.. ఇప్పుడు కూటమి పార్టీల్లోనే తీవ్ర వివాదానికి దారితీస్తోంది. సొంత పార్టీల నేతల ఓట్లపైనే కోత పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ ’సర్‌’ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేస్తూ.. తన ఆధీనంలోకి తీసుకున్నారని, జనసేన నేతల ఓట్లను సైతం తొలగిస్తున్నారని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. తన సమీప బంధువుల ఓట్లతో పాటు, తన ముఖ్య మద్దతుదారుల ఓట్లను కూడా తొలగిస్తున్నారంటూ జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణలు చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే వైఖరిని నిలదీస్తున్న సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. ఈ ’సర్‌’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆక్షేపించారు.

సీఈవో, కలెక్టర్‌కు ఫిర్యాదు

ఈ అక్రమాలపై పీతల మూర్తియాదవ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు బుధవారం నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా పంపారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకుంటూ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల ద్వారా కాకుండా, టీడీపీకి చెందిన బూత్‌ లెవల్‌ ఏజెంట్ల ద్వారా గుండుగుత్తగా ఫారాలు నింపుతున్నారని ఆరోపించా రు. తొలగించాల్సిన ఓట్లను ముందే టిక్‌ చేసి మరీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని.. టీడీపీకి చెందిన బీఎల్‌ఏలు ఏకంగా తలుపులు మూసి మరీ ఫారాలు నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం విశాఖపట్నంలోని కూటమి నేతల మధ్య తీవ్ర చిచ్చురేపింది.

అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తంతు..!

ఒకవైపు ప్రతిపక్ష పార్టీల ఓట్లకు ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లాగే, ఏజెంట్ల నియామకం కూడా ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

అనకాపల్లి: ఇక్కడ పూర్తిస్థాయిలో జనసేనకు చెందిన బీఎల్‌ఏలను నియమించారని, తమకు కనీస ప్రాతినిధ్యం దక్కలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

యలమంచిలి, పెందుర్తి, విశాఖ సౌత్‌: ఈ నియోజకవర్గాల్లో అన్ని బూత్‌లలోనూ టీడీపీ నేతలను బీఎల్‌ఏలుగా నియమించలేదని ఆ పార్టీ క్యాడర్‌ వాపోతోంది. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో జనసేన వారికే అవకాశం దక్కడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.

బీజేపీ అసహనం: ఈ గందరగోళంలో తమను అసలు పట్టించుకునే నాథుడే లేడని స్థానిక బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మిగిలిన నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ నేతలకే బీఎల్‌ఏలుగా అవకాశం కల్పించారని ఇతర కూటమి భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ అసంతృప్తి లోలోపలే రగిలిపోగా.. ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన మాజీ కార్పొరేటర్‌ నేరుగా వీధికెక్కి రచ్చ చేయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

టిక్‌ మార్కులతో ఓట్ల తొలగింపు!

రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను అధికార పార్టీ నేతలు ముందే గుర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయరని భావించే వారి పేర్లను ఓటర్ల జాబితాలో గుర్తించి, వాటి పక్కన ’టిక్‌ మార్కు’ పెడుతున్నారు. ఆ జాబితాలను అధికార పార్టీకి చెందిన బీఎల్‌ఏలకు అందజేస్తున్నారు. వీరి ఒత్తిళ్లకు లొంగి బీఎల్‌ఓలు ఆయా ఓటర్లకు ఫారాలు అందజేయకపోవడమో.. లేదా సదరు బీఎల్‌ఏలే తప్పులతడకగా ఫారాలు నింపి, ఆ ఓట్లు త్వరగా తొలగిపోయేలా రంగం సిద్ధం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement