కేబినెట్ సబ్‌కమిటీ పేరుతో రుషికొండ భవనాలపై కొత్త డ్రామా పర్యాటక భవనాలంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటనలు ఇక్కడికి వచ్చి జగన్ ప్యాలెస్ అంటూ అవాకులు చెవాకులు ఓర్వలేక అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు అండ్ కో
సాక్షి, విశాఖపట్నం: రుషికొండపై నిర్మించిన అద్భుత ప్రభుత్వ భవనాలు కనిపిస్తే చాలు.. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అదే పాత రాజకీయానికి తెరతీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాసనసభ సాక్షిగా ఇవి పర్యాటక శాఖకు చెందిన ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తూనే, ప్రజల్లోకి వచ్చాక మాత్రం ‘జగన్ ప్యాలెస్’ అంటూ రాజకీయ విమర్శలకు దిగడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, విశాఖ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రుషికొండపై అత్యాధునిక ప్రమాణాలతో ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. అయితే ఈ భవనాలను ప్రజల ప్రయోజనాలకు వినియోగించే దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం.. కేబినెట్ సబ్‌కమిటీ పేరుతో మరోసారి రాజకీయ రచ్చకు తెరతీసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ప్రతిష్టను పెంచే నిర్మాణాలు
పర్యాటక రంగ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సులు, ఉన్నత స్థాయి సమావేశాల నిర్వహణకు అనువుగా విశాఖలో ప్రభుత్వానికి సొంతంగా అత్యాధునిక వసతి సముదాయం అవసరమనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారని చెబుతున్నారు. సముద్ర తీరానికి ఆనుకుని, పచ్చని ప్రకృతి మధ్య నిర్మించిన ఈ భవనాలు విశాఖకు కొత్త గుర్తింపుగా నిలుస్తాయని భావిస్తున్నారు. అయితే రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా మిగిలే ఈ నిర్మాణాలను రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం సరికాదని, వాటిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని విశాఖ వాసులు సూచిస్తున్నారు. అభివృద్ధి, ఆస్తుల సృష్టిపై చర్చించాల్సిన చోట రాజకీయ అక్కసు ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలే దెబ్బతింటాయని అభిప్రాయపడుతున్నారు.
తాత్కాలిక భవనాలకు వేల కోట్లు..!
చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేసిన విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాత్కాలిక నిర్మాణాలకే రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా నిలిచే రుషికొండ భవనాలపై విమర్శలు చేయడం విడ్డూరమని అంటున్నారు. మరోవైపు రుషికొండ భవన సముదాయం సుమారు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మితమైందని, అంతర్జాతీయ స్థాయి అతిథులు, విదేశీ ప్రతినిధులు, రాష్ట్రపతులు, ప్రధానులు బస చేయగలిగే స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో రూపొందించారని గుర్తుచేస్తున్నారు.
రుషికొండ భవనాల పరిశీలన
కొమ్మాది: రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను బుధవారం సాయంత్రం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు. ఈ భవన సముదాయంలో నిర్మాణ విషయాలును, నిర్మాణ సామర్థ్యం, పలు అంశాలను టూరిజం ఇజనీర్లు వీరికి వివరించారు. స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, పలువురు టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తి..
రాజకీయ లక్ష్యమా?
రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి ఏ వ్యక్తి సొంతం కావు. ఈ విషయం తెలిసినప్పటికీ కేవలం రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా విమర్శలు కొనసాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో ఒక మాట, బయట మరో మాట మాట్లాడటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నారు.


