కాందిశీకుల పేరుతో కబ్జా! | - | Sakshi
Sakshi News home page

కాందిశీకుల పేరుతో కబ్జా!

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

ప్రభుత్వ స్థలమని బోర్డు ఉన్నా ఆగని ఆక్రమణలు ఇల్లు లేని పేదల పేరుతో తిష్టవేసిన నాయకులు రూ.100 కోట్ల స్థలంపై కన్ను! కలెక్టరుకు ఫిర్యాదు చేసిన కాలనీవాసులు

ప్రభుత్వ స్థలంలో ఇళ్లు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలం అని బోర్డు స్పష్టంగా ఉన్నా.. ఆక్రమణదారుల అడుగులు మాత్రం ఆగడం లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంప్‌లో సర్వే నంబర్‌ 13/ఏ/14లో ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై కాందీశీకుల పేరుతో కబ్జా యత్నాలు జరుగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఇప్పుడు కొద్ది మంది నాయకులు కాస్తా ఇష్టారీతిలో ఇక్కడ స్థలాన్ని ఆక్రమించి కబ్జాలకు తెగబడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లు లేని స్థానిక పేదలకు స్థలం ఇవ్వకుండా.. తమ అనుయాయులకు ఇష్టారీతిలో కేటాయించుకుని.. పక్కాగా కాందిశీకుల పేరుతో కబ్జాకు దిగారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ నేరుగా కాలనీవాసులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.

ఇళ్లు ఇస్తామంటూ నమ్మించి..!

వాస్తవానికి కాలనీలోని పేదల సంక్షేమ కోసం 2014లో బర్మా కాందిశీకుల సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని స్థాపించారని స్థానికులు పేర్కొంటున్నారు. కొంత ప్రభుత్వ భూమి ఉందని, ఇల్లు లేని పేదలకు ఇద్దామనే ఉద్దేశంతో సంఘాన్ని స్థాపించామని తమను నమ్మబలికారని స్థానికులు అంటున్నారు. అయితే, వాస్తవంలో మాత్రం కొద్ది మంది సంఘానికి చెందిన నేతలు అక్రమార్కులతో చేతులు కలిపి, గ్రామ ప్రజలను అవమానించారని వాపోతున్నారు. 48, 60, 180 గజాల లెక్కల విభజించి.. తమ అనుయాయుల పేరుతో ఆక్రమణకు దిగారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు, అక్రమార్కులకు స్థలాలను కేటాయించి, ఇప్పుడు దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాందిశీకుల పేరుతో జరుగుతున్న కబ్జాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రూ.100 కోట్ల పైమాటే...!

వాస్తవానికి ఇక్కడ గజం మార్కెట్‌ ధర భారీగా పలుకుతోంది. అంత విలువైన ప్రదేశంలో కబ్జాకు తెగబడుతుంటే.. రెవెన్యూ వర్గాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక్కడ మార్కెట్‌ ధర గజం రూ.80 వేల చొప్పున పలుకుతోంది. అంటే 3 ఎకరాల ధర ఏకంగా రూ.100 కోట్ల మేర ఉంటుందని అంచనా. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అండదండలున్నాయని సదరు అక్రమార్కులు పేర్కొంటున్నట్టు విమర్శలున్నాయి. అందుకే గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటివరకూ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement