జీవోలను వెంటనే వెనక్కి తీసుకోండి! కూటమి పాలనలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, పెరిగిన నేరాలు ఆదాయం అంతగా కావాలంటే గీతం సంస్థల్లో పెట్టుకోండి.. ఎంపీ భరత్‌పై ధ్వజం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం బీచ్ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం జీవోలు 362, 363 విడుదల చేయడం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి వేళ కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే విశాఖ తీరంలో మద్యం దుకాణాలు పెట్టి ప్రజల స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలుకుతోందని ధ్వజమెత్తారు.
ఎంపీ భరత్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
విశాఖ పర్యాటక ప్రాంతంలో మద్యం షాపుల ఏర్పాటును మహిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమన్నారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన విశాఖ ఎంపీ శ్రీభరత్ అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీచ్ షాక్స్ ద్వారా ఆదాయం వస్తే తప్పేంటని ఎంపీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ.. మద్యం షాపులు అంతగా కావాలనుకుంటే ఆయన సొంత విద్యాసంస్థలైన గీతంలో పెట్టుకోవాలని హితవు పలికారు. విశాఖ రైల్వే జోన్ కేకే లైను వేరే రాష్ట్రానికి తరలిపోతున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నా నోరు మెదపని ఎంపీ.. మద్యం షాపులను సమర్థించడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో లక్షకు పైగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, పర్మిట్ రూమ్‌ల పేరిట మద్యాన్ని విపరీతంగా అందుబాటులోకి తెచ్చారని విమర్శించారు. మద్యం మత్తు కారణంగానే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, గృహహింసతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి బీచ్ షాక్స్‌కు సంబంధించిన జీవో నెంబర్ 362ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


