పీఎం పాలెం: ఏపీఎస్‌పీ 16వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా పి.అనిల్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన బెటాలియన్ పరిపాలన, సిబ్బంది శిక్షణ, క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలు, విధుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెటాలియన్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రజల భద్రత, పరిరక్షణ కోసం మరింత సమర్థవంతమైన పోలీసింగ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే విధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. 16వ బెటాలియన్‌ను రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.


