కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్‌ ట్రైన్‌’ | - | Sakshi
Sakshi News home page

కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్‌ ట్రైన్‌’

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

ఏడాదిగా వినిపించని కూత

మూలకు చేరిన ‘విశాఖ దర్శిని’

మరమ్మతులు చేయకుండా

అధికారుల నిర్లక్ష్యం

బోసిపోతున్న రైల్వే స్టేషన్‌..

పర్యాటకుల నిరాశ

ఆరిలోవ: కై లాసగిరిపై అందాల ప్రయాణం అటకెక్కింది. శిఖరంపై నుంచి సాగర సోయగాలు.. సుందర నగర అందాలు తిలకించే భాగ్యం పర్యాటకులకు దూరమైంది. దశాబ్దాలుగా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచిన ఆ చిన్నారి రైలు కూత ఆగిపోయింది. విశాఖ పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచిన కై లాసగిరి ‘టాయ్‌ ట్రైన్‌’ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా పట్టాలపై మూలకు చేరింది. సాంకేతిక లోపమో.. లేక అధికారుల ఉదాసీనతో కానీ, ఏడాదిగా ఆగిపోయిన ఈ రైలు కథ ఇక ముగిసినట్లేనా అన్న ఆందోళన పర్యాటకుల్లో వ్యక్తమవుతోంది. నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిపై సందర్శకులను ఎంతగానో అలరించిన ‘విశాఖ దర్శిని’ సర్క్యూట్‌ రైలు కథ ముగిసినట్లేనా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి పరిస్థితులు.

పట్టాల పక్కనే అనాథలా..

గత కొన్నాళ్లుగా ఈ టాయ్‌ ట్రైన్‌ సాంకేతిక లోపాలతో నడక సాగించలేకపోతోంది. రైలు మరమ్మతులకు గురికావడంతో వీఎంఆర్‌డీఏ అధికారులు దీన్ని కనీసం షెడ్డుకు కూడా చేర్చకుండా, స్టేషన్‌కు కొంత దూరంలో పట్టాలపైనే వదిలేశారు. ఈ రైలు అందుబాటులో లేకపోవడంతో కై లాసగిరికి వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. గతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అత్యధికంగా ఈ టాయ్‌ ట్రైన్‌ ఎక్కేందుకే ఆసక్తి చూపించేవారు. ఇందులో ప్రయాణిస్తూ సాగర తీరాన్ని వీక్షించి మురిసిపోయేవారు. దీంతో ఈ రైలు కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేషన్‌ ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడుతూ ఉండేది. కానీ, ఏడాది కాలంగా రైలు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పూర్తిగా బోసిపోయింది. ఈ రైలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇప్పటికై నా వీఎంఆర్‌డీఏ అధికారులు స్పందించి, తక్షణమే ఈ టాయ్‌ ట్రైన్‌కు మరమ్మతులు చేయించి పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement