ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ‘బి2’ కింద మార్చింది భవిష్యత్తులో నీటి సంక్షోభం, గ్రిడ్‌పై భారం, కరెంట్ కోతలు తప్పవు జల్ బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యన్నారాయణ
సీతంపేట: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిబంధనలను బేఖాతరు చేస్తూ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని జల్ బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డేటా సెంటర్ల కారణంగా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదంటూ స్థానిక ఎంపీ ఎం.శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పర్యావరణ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనలు వర్తించే కేటగిరి ‘ఏ’ కింద పరిగణించాల్సిన భారీ డేటా సెంటర్లను, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటగిరి ‘బీ2’ కిందకు మార్చి పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణను, సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియలను పూర్తిగా పక్కనబెట్టి అనుమతులు జారీ చేయడం దారుణమన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర పర్యావరణ మంత్రులతో గానీ, ముఖ్యమంత్రితో గానీ మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. ఈ డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో నగరంలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడుతుందని, పవర్ గ్రిడ్‌పై భారం పడి కరెంట్ కోతలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా నగర ఉష్ణోగ్రతలు 1 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందన్నారు. సమగ్ర పర్యావరణ ఆడిట్ నిర్వహించే వరకు ఈ డేటా సెంటర్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.


