ఉక్కునగరం: స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సెఫీ) బృందం బుధవారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించింది. సెఫీ చైర్మన్ ఎం.కె.బంచోర్, వైస్‌చైర్మన్ అజయ్‌పాండే, ప్రధాన కార్యదర్శి సంజయ్ ఆర్య ఉదయం కోక్ ఓవెన్, స్టీల్ మెల్ట్ షాప్‌లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌లోని సీసీడీ, బ్లూమ్ స్టోరేజ్ యార్డ్‌లకు వెళ్లారు. డైరెక్టర్(ఆపరేషన్స్) సుభశిస్ సేన్ గుప్తా, చీఫ్ జనరల్ మేనేజర్ (వర్క్స్) అనింధ్య ఘోష్‌లను కలిసి స్టీల్‌ప్లాంట్, అధికారుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్‌ను కలిసి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారితో సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. డైరెక్టర్ (ఫైనాన్స్) వినయ్ కుమార్‌ను కలిసి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తే ఇరు సంస్థలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. సాయంత్రం సి–భవన్‌లో ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమస్యలపై కేంద్ర మంత్రి కుమారస్వామి, కార్యదర్శి సందీప్ పాండ్రిక్‌లతో మాట్లాడతామన్నారు. సెయిల్ నుంచి అన్ని విధాల సహకారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు విద్యుత్ కుమార్ వర్మ, ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


