అమర్‌నాథ్‌ చిత్రపటం దహనంపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ చిత్రపటం దహనంపై చర్యలు తీసుకోండి

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో

వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం ఫిర్యాదు

బీచ్‌రోడ్డు : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌ చిత్రపటాన్ని దహనం చేస్తూ రెచ్చగొట్టే నినాదాలు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు బోని శివ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీ సెల్‌ నాయకులతో కలిసి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 15న సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రి సమీపంలో టీడీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా అమర్‌నాథ్‌ చిత్రపటాన్ని దిష్టిబొమ్మకు అమర్చి దహనం చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమర్‌నాథ్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అభ్యంతరకర నినాదాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి చర్యలు రాజకీయ వైరాన్ని పెంచడమే కాకుండా సమాజంలో వివిధ వర్గాలు, కులాల మధ్య విద్వేషాలు రేకెత్తించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలు చేయడం, దిష్టిబొమ్మల దహనాలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగ నాయకులు పాక సత్యనారాయణ, విక్టర్‌, వెంకటేశ్వర్లు, కోన వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement