ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
ఇంటింటికీ బూత్ స్థాయి అధికారులు
తొలి రోజే 21 వేల ఫారాల పంపిణీ
తోడుగా రాజకీయ పార్టీల ప్రతినిధులు
మహారాణిపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం జిల్లాలో అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టారు. సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. తొలి రోజు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి సుమారు 21 వేల ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు. వివరాలు నింపిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో వాటిని తిరిగి సేకరించనున్నారు.
1,980 మంది బీఎల్‌వోల నియామకం
జిల్లాలో ఉన్న 20,23,009 మంది ఓటర్ల ఇళ్లకు ఈ ఫారాలను సకాలంలో చేరవేయడానికి ఎన్నికల యంత్రాంగం 1,980 మంది బీఎల్‌వోలను నియమించింది. పోలింగ్ స్టేషన్ల వారీగా కేటాయించిన ఇళ్లకు బీఎల్‌వోలు స్వయంగా వెళ్తున్నారు. వీరితో పాటు గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి పార్టీ నుంచి ఒక ప్రతినిధి పోలింగ్ స్టేషన్ పరిధిలో పర్యటించి, ఫారాలను భర్తీ చేయడంలో ఓటర్లకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు వీలు కల్పించారు.
మూడు సార్లు పర్యటన..
ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్‌వోలు ప్రతి ఇంటికి రెండు ప్రతులు కలిగిన ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారు. ఫారం ఎలా నింపాలో ఓటరుకు వివరించి, పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారు. నింపిన రెండు ఫారాల్లో ఒకదాన్ని బీఎల్‌వో తన వద్ద ఉంచుకుని, రెండో దాన్ని ఓటరుకు రశీదుగా తిరిగి ఇస్తారు. బీఎల్‌వోలు వెళ్లిన సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఉంటే, ఎన్యూమరేషన్ ఫారాన్ని అక్కడే ఉంచి వస్తారు. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు ఆ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించేలా ప్రణాళిక రూపొందించారు. ఒకవేళ నేరుగా వీలుకాకపోతే, ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన తర్వాత తిరిగి యాప్‌లో అప్‌లోడ్ చేసి బీఎల్‌వోకు అందించే డిజిటల్ వెసులుబాటును కూడా కల్పించారు.
ఓటరు సవరణ షెడ్యూల్
ఈ సవరణ కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించింది. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు ముసాయిదా ఓటరు జాబితాలపై అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 లోగా పరిష్కరిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.
ఇంకా 6.32 లక్షల మందికి మ్యాపింగ్
జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మ్యాపింగ్ ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం 20.23 లక్షల మంది ఓటర్లలో ఇప్పటివరకు 13,90,310 మందికి (68.72 శాతం) మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 31.28 శాతం అంటే దాదాపు 6,32,699 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావాల్సి ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
‘ఫారం–2’ భర్తీపై అవగాహన అవసరం
ఈ సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరు విధిగా ఎన్యూమరేషన్ ‘ఫారం–2’ను పూరించి ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలకు అప్పగించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు, పనుల నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లే సామాన్యులకు ఈ ఫారాల్లోని సాంకేతిక వివరాలు పూర్తి చేయడంపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు భద్రంగా ఉండేందుకు వీలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


