కలెక్టరేట్‌ సాక్షిగా ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ సాక్షిగా ఆకలి కేకలు

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

● గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళనలు ● కేజీహెచ్‌, ఏఎంసీ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 13 నెలలుగా అందని జీతాలు ● మూడో సారి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

మహారాణిపేట: వైద్య, విద్యా రంగాల్లో కీలకమైన సేవలందిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారింది. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకున్నారు.

కేజీహెచ్‌, ఏఎంసీ సిబ్బంది ఆవేదన

కేజీహెచ్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీలలో జనరల్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికై , 13 నెలలుగా వివిధ కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 36 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. ఎనిమిది నెలలకు పైగా ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో, జీతాలు వస్తాయనే ఆశతోనే ఇంతకాలం విధులు నిర్వహించినట్లు ఉద్యోగులు వాపోయారు. ఈ సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడం ఇది మూడోసారి అయినప్పటికీ, అధికారులు ఎలాంటి స్పందన చూపకపోగా కొందరు అసహనం ప్రదర్శించారని ఉద్యోగులు ఆరోపించారు. ఇన్‌చార్జ్‌ మంత్రి, కలెక్టర్‌ నుంచి అనుమతులు వచ్చినా కొందరు అధికారులు ఫైల్‌ను ముందుకు కదపకుండా తొక్కిపెట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

6 నెలలుగా జీతాల్లేవు: మరోవైపు డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ గురుకులాల్లో పనిచేస్తున్న దాదాపు 20 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా గత 6 నెలలుగా జీతాలు అందడం లేదు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్నా.. బయటకు చెబితే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయో అన్న భయంతో సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. చివరకు సహనం నశించి, ఐఎఫ్‌టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. గణేష్‌ నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ నేత గణేష్‌ మాట్లాడుతూ.. ఆకలితో అలమటిస్తున్న ఉద్యోగుల సమస్యను కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని, తక్షణమే బకాయి జీతాలు విడుదలయ్యేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement