అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ఐలా స్థానిక సంస్థ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్ష ప్యానల్ చైర్మన్ అభ్యర్థి కొల్లి ఈశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో పక్షపాత రహితంగా వ్యవహరించాల్సిన అధికారులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి ఏకపక్ష వైఖరితో వ్యవహరించడం వల్లే తుది ఫలితం తారుమారైందని ఆరోపించారు. చైర్మన్ పదవికి పోటీ చేసిన తనకు, యార్లగడ్డ సాంబశివరావుల మధ్య హోరాహోరీ పోరు సాగిందని, చివరకు కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయించడం వెనుక అధికారుల ముందస్తు వ్యూహం ఉందని ఆరోపించారు. ఎన్నికల అధికారి ఆదిశేషు పర్యవేక్షణలో మొత్తం 1,030 మంది ఓటర్లకు గాను 704 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం 815 ఓట్లు నమోదైనట్లు తెలిపారు. పోలింగ్ సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు.
తెరపైకి ముద్రల వివాదం
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లను గందరగోళానికి గురిచేసే విధంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించారని ప్రతిపక్ష ప్యానల్ నేతలు ఆరోపించారు. ఓటు వేయడానికి ఉపయోగించిన అధికారిక ముద్ర దెబ్బతిన్న స్థితిలో ఉందని, దానిపై ఉండాల్సిన గుర్తు సగం వరకు చెరిగిపోయిందని తెలిపారు. దీనిపై నవభారత్ ఫౌండ్రీస్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ ప్రతినిధి లంక సుబ్బారావు, శ్రీ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి లక్ష్మీదేవి అల్లాపర్తి పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించారని పేర్కొన్నారు. అయితే ఆ ముద్రతో వేసిన ఓట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ లెక్కింపు సమయంలో అదే ఓట్లను చెల్లనివిగా ప్రకటించడం తీవ్ర అన్యాయమని విమర్శించారు.
లెక్కింపులో నిబంధనల ఉల్లంఘన
మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టారని ప్రతిపక్ష ప్యానల్ ఆరోపించింది. ముఖ్యంగా కొన్ని పోస్టల్ బ్యాలెట్లను సరైన ధ్రువీకరణ లేకుండానే లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారని, దీనిపై కౌంటింగ్ ప్రారంభానికి ముందే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
న్యాయపోరాటానికి సిద్ధం
ఎన్నికల్లో జరిగిన లోపాలు, అధికారుల పక్షపాత వైఖరికి నిరసనగా తాము ఫలితాల ప్రకటన పత్రంపై సంతకం చేయలేదని కొల్లి ఈశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రకటించిన ఈ ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలతో త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేపడతామని ప్రతిపక్ష ప్యానల్ ప్రతినిధులు వెల్లడించారు.
ప్రతిపక్ష ప్యానల్ చైర్మన్ అభ్యర్థి
కొల్లి ఈశ్వరరావు ఆరోపణ


