ఫలితాలు వెలువడినా.. ప్రవేశాల్లో తీవ్ర జాప్యం
పచ్చ నేతల
వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్–2041.. టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ బ్లూప్రింట్
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, విశాఖపట్నం : మహా నగర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాల్సిన వీఎంఆర్‌డీఏ సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్–2041, అధికార టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించిన ‘మాస్టర్ స్కెచ్’గా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభ్యంతరాల పేరుతో చేపట్టిన సవరణల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు తమ భూములు, వెంచర్లకు అనుకూలంగా భూవినియోగ మార్పులు చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన 1,241 అభ్యంతరాల్లో కేవలం 399 మాత్రమే పరిగణనలోకి తీసుకున్న అధికారులు, అధికార పార్టీ నేతలకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం విస్తృతంగా భూవినియోగ మార్పులు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ ఉన్నతాధికారిని సైతం బదిలీ చేసి, తమకు అనుకూలంగా సవరణలు పూర్తి చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక రంగానికి అతి తక్కువ భూకేటాయింపులు చేస్తూ, రియల్ ఎస్టేట్‌కు లాభదాయకమైన రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల అభ్యంతరాలా..
లేక నేతల సూచనలా?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో సవరణలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, దానిని అధికార పార్టీ నేతలు తమ ప్రయోజనాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా, అధికార పార్టీ నేతల సూచనలకే పెద్దపీట వేశారని విమర్శలు ఉన్నాయి. అందిన 1,241 అభ్యంతరాల్లో 399 ప్రత్యేక అభ్యంతరాలు, సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సవరణలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ‘ప్రత్యేక అభ్యంతరాలు’ సామాన్య ప్రజలవి కాకుండా, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీగా భూములు కలిగిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు, బినామీలవేనన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ, పరిమిత వినియోగ ప్రాంతాల్లో ఉన్న భూములను నివాస, వాణిజ్య జోన్లుగా మార్చుకునేందుకే ఈ సవరణల ప్రక్రియను ఉపయోగించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పారిశ్రామిక రంగానికి వెన్నుపోటు
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మాస్టర్ ప్లాన్‌లో మాత్రం పారిశ్రామిక రంగానికి అత్యల్ప ప్రాధాన్యం ఇచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి కల్పనకు కీలకమైన పారిశ్రామిక రంగానికి కేవలం 55 చ.కిమీ (1.30 శాతం) మాత్రమే కేటాయించారు. మరోవైపు, రియల్ ఎస్టేట్‌కు అధిక లాభాలు తెచ్చిపెట్టే నివాస, మిశ్రమ వినియోగ జోన్లకు భారీ స్థాయిలో భూములు కేటాయించారు. దీంతో ముందుగానే భూములు కొనుగోలు చేసి పెట్టుకున్న అధికార పార్టీ నేతల వెంచర్లకు ప్రభుత్వ ముద్ర వేయడానికే ఈ సవరణలు జరిగాయన్న ఆరోపణలు బలపడుతున్నాయి.
వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్
కారిడార్ల పేరుతో
కమర్షియల్ గేమ్?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అనుసంధాన రహదారులు, తీరప్రాంత అభివృద్ధి కారిడార్, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌కు ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారిడార్ల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అధికార పార్టీ నేతలు, వారి బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పను బదిలీ చేయించి, తమకు అనుకూలమైన అధికారిని నియమించి సవరణలను వేగంగా పూర్తి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2041 నాటికి 66.30 లక్షల జనాభా అవసరాల పేరుతో ప్రతిపాదించిన 3,913 కిలోమీటర్ల రహదారి నెట్‌వర్క్‌లోని పలు ఎలైన్‌మెంట్‌లు అధికార పార్టీ నేతల భూములు, లేఅవుట్లకు అనుకూలంగా రూపొందించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేతలకు చెందిన భూములు ఉన్న ప్రాంతాలను హై–వాల్యూ జోన్లుగా మార్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి మాస్టర్ ప్లాన్‌ను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారన్నదే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన విమర్శ.
పచ్చ నేతల ‘రియల్’ దాహం!
వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన సవరించిన భూ వినియోగ పట్టికను పరిశీలిస్తే, రియల్ ఎస్టేట్‌కు అనుకూలమైన కేటాయింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీఎంఆర్‌డీఏ పరిధిలోని మొత్తం 4,380 చ.కిమీ విస్తీర్ణంలో వ్యవసాయ భూములకు 1,774 చ.కిమీ (40.50 శాతం) కేటాయించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కీలకమైన రెసిడెన్షియల్ జోన్లకు ఏకంగా 744 చ.కిమీ (17 శాతం) కేటాయించారు. అలాగే నివాస, వాణిజ్య అవసరాలకు ఒకేసారి ఉపయోగించే మిశ్రమ వినియోగ (మిక్స్‌డ్ యూజ్) జోన్లకు 372 చ.కిమీ (8.5 శాతం) రిజర్వ్ చేశారు.
అభ్యంతరాల ముసుగులో
తమకనుకూలంగా భారీ మార్పులు
టీడీపీ నేతల భూములు,
వెంచర్లకు అనుగుణంగా
భూవినియోగ సవరణలు
1,241 అభ్యంతరాల్లో కేవలం
399 మాత్రమే పరిగణనలోకి..
సవరణలను వ్యతిరేకించిన
చీఫ్ అర్బన్ ప్లానర్ బదిలీ
రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు
17.20 శాతం కేటాయింపు
పారిశ్రామికాభివృద్ధికి
నామమాత్రపు ప్రాధాన్యం


