డాబాగార్డెన్స్/విశాఖ విద్య: ఒకరికి మరొకరితో పరిచయం ఉండదు. బంధుత్వం ఉండదు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలూ ఉండవు. అయినా ఒకరు ఇచ్చే చుక్క రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. ఓ కుటుంబంలో ఆరిపోతున్న ఆశాదీపాన్ని మళ్లీ వెలిగిస్తుంది. అందుకే స్వచ్ఛంద రక్తదానాన్ని అన్ని దానాలకన్నా గొప్పదానంగా భావిస్తారు. ప్రాణం విలువ తెలిసినవారే రక్తదానం చేస్తారు. అందుకే రక్తదాతలను మానవత్వానికి ప్రతిరూపాలుగా చూస్తారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న నిర్వహించడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. ప్రాణదానంగా నిలిచే రక్తదానంపై అవగాహన పెంచడం, కొత్త రక్తదాతలను తయారుచేయడం, ఇప్పటికే సేవలందిస్తున్న వారిని గౌరవించడం.
ప్రాణం పోసే మానవత్వం
రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, తలసేమియా వంటి వ్యాధుల చికిత్సలో రక్తం అత్యవసరం. సమయానికి రక్తం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆస్పత్రికి తీసుకొచ్చినా రక్తదాతలు దొరక్క విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చే రక్తదాతలు నిజమైన ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వారు ఇచ్చే ఒక్క యూనిట్ రక్తాన్ని మూడు భాగాలుగా విభజించి ముగ్గురికి ఉపయోగించవచ్చు. అంటే ఒక రక్తదాత ముగ్గురి జీవితాల్లో వెలుగు నింపగలడు.
శతాధిక రక్తదాత... ఎందరికో ప్రాణదాత
వన్‌టౌన్‌లోని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు రక్తదాతలలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు 118 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడారు. 2004లో తన ఆప్తురాలు కళావతికి రక్తం అవసరమైన సందర్భం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆమెను కాపాడలేకపోయినా, రక్తం విలువను గుర్తించిన అప్పారావు అప్పటి నుంచి రక్తదానాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. ఇప్పటికే 118 సార్లు రక్తదానం చేయడమే కాకుండా వందలాది మంది యువతను రక్తదానానికి ప్రోత్సహించారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పలు సందర్భాల్లో సత్కరించింది. ఆయన బాటలోనే కుమార్తెలు, కుమారులు కూడా ప్రతి ఏడాది రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రక్తదానం చేసిన సూరాడ అప్పారావు(ఫైల్)
రక్తదానం చేయాలంటే..
18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తపోటు, హిమోగ్లోబిన్, శరీర ఉష్ణోగ్రత తదితర పరీక్షల అనంతరం మాత్రమే రక్త సేకరణ చేస్తారు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు సంక్రమించవు. రక్తదానం చేసిన తర్వాత 10 నిమిషాల విశ్రాంతి తీసుకుని అల్పాహారం తీసుకుంటే తిరిగి సాధారణ పనులు చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.
బ్లడ్ డోనర్స్ క్లబ్‌లే జీవనాధారం
రక్తదాతలను అవసరమైన వారికి అనుసంధానించడంలో బ్లడ్ డోనర్స్ క్లబ్‌ల పాత్ర కీలకంగా మారుతోంది. 2019లో ఏర్పడిన విశాఖ బ్లడ్ డోనర్స్ క్లబ్ ప్రస్తుతం 3,800 మంది యాక్టివ్ డోనర్లతో 24 గంటల సేవలు అందిస్తోంది. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సాసుపల్లి రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 50 వేల యూనిట్ల రక్తం సేకరించగా, 170 యూనిట్ల ప్లాస్మాను కూడా అవసరమైన వారికి అందించారు. రాష్ట్రేతర ప్రాంతాల క్లబ్‌లు, రెడ్‌క్రాస్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అత్యవసర సమయాల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే రక్తం కొరతను తీర్చడానికి లైవ్ డోనర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతున్నారు.


