డాబాగార్డెన్స్: జీవీఎంసీ నాన్ పీహెచ్ ఎంప్లాయిస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ తన సభ్యులకు అండగా నిలిచింది. జనరల్ బాడీ తీర్మానం ప్రకారం.. వైద్యుల సూచనతో మెడికల్ టెస్టులు చేయించుకున్న సభ్యులు కారి యల్లయ్య, ఎ.వెంకటేశ్వరగుప్తా, పి.సాయి అనితలకు సొసైటీ అధ్యక్షుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత వీవీ వామనరావు శుక్రవారం రూ.3వేల రీయింబర్స్‌మెంట్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ఉన్నప్పటికీ, అది ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే వర్తిస్తుందన్నారు. అవుట్ పేషెంట్‌గా వెళ్లినప్పుడు మెడికల్ టెస్టుల భారం ఉద్యోగులపై పడుతోందని, వారి ఆర్థిక ఇబ్బందులను గమనించే ఈ రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బుద్దల తాతారావు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు సీతారాం, ప్రధాన కార్యదర్శి గుమ్మడి నర్సింగరావు, కోశాధికారి డొక్కరి పోలిపిల్లి తదితరులు పాల్గొన్నారు.


