వేట నిషేధ కాలం సగం గడిచినా అందని ‘మత్స్యకార భరోసా’
డేటా ఫిల్టరింగ్ పేరుతో లబ్ధిదారుల పేర్ల తొలగింపు దుర్మార్గం
వారం రోజుల్లో నగదు జమ చేయకుంటే మంత్రి అచ్చెన్నాయుడుని అడ్డుకుంటాం
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మత్స్యకారుల సేవ’ పథకం పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్ప టికీ, క్షేత్రస్థాయిలో అనేక మంది మత్స్యకారులకు సాయం అందలేదని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.261.59 కోట్ల సాయం అందించామని ప్రభుత్వం చెబుతున్నా, చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు ఇంకా జమ కాలేదని పేర్కొన్నారు.ఇతర పథకాల లింకేజీలు, కుటుంబంలో పెన్షన్ పొందుతున్న సభ్యులు ఉండటం, విద్యుత్ వినియోగం వంటి కారణాలను చూపుతూ వేలాది మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం అన్యాయమని విమర్శించారు. జిల్లాలో సుమారు 30 వేల మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడుతున్నప్పటికీ, కేవలం 13 వేల మందినే లబ్ధిదారులుగా గుర్తించారని ఆరోపించారు.
మంత్రి అచ్చెన్నాయుడును అడ్డుకుంటాం
ఏప్రిల్ 15 నుంచి అమల్లో ఉన్న వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు భరోసా సాయం అందడం లేదని సనపల రవీంద్ర భరత్ విమర్శించారు. వారం రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారులందరి ఖాతాల్లో మత్స్యకార భరోసా నిధులు జమ చేయాలని, లేకపోతే మత్స్యకార సంఘాలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడును జిల్లాలో అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమ్మిడి కళ్యాణ్, పోతిబంతి హరికృష్ణ, బొండాడ వెంకటరమణ, కంటుముచ్చు సాగర్, చేపల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


