మద్దిలపాలెం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 28,361 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,193 మంది హాజరుకానున్నారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.మురళీధర్ తెలిపారు. మొత్తం 45,554 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు.
పటిష్ట నిఘా.. 144 సెక్షన్ అమలు
పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షల పర్యవేక్షణలో ఉండనున్నాయి. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
జూన్ 7 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
లిఖిత పరీక్షల అనంతరం జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ విద్యార్థులకు డాక్టర్ వి.ఎస్.కృష్ణ జూనియర్ కళాశాల, ఒకేషనల్ విద్యార్థులకు ప్రభుత్వ ఒకేషనల్ కళాశాల కేంద్రాలుగా నిర్ణయించారు. అలాగే జూన్ 5న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జూన్ 6న ఎన్విరాన్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


