అల్లిపురం: పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి పారదర్శకతతో విధులు నిర్వహించాలని, విధుల్లో అధికార దుర్వినియోగానికి లేదా అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. బుధవారం నగర పోలీస్ సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మాదకద్రవ్యాల రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నేరాల అదుపునకు అవసరమైన చోట్ల డికోయ్ టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ క్రైం నివారణకు వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళా రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’విధానంలో భాగంగా స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.


