వివాహితపై ప్రియుడి హత్యాయత్నం! | - | Sakshi
Sakshi News home page

వివాహితపై ప్రియుడి హత్యాయత్నం!

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

● మెడకు వైరు బిగించి హత్యకు ప్రయత్నం ● చనిపోయిందనుకుని పరారీ ● స్పృహతప్పి పడి ఉన్న బాధితురాలిని కాపాడిన వాకర్స్‌

కొమ్మాది: కాపులుప్పాడ సమీపంలో ఓ వివాహితపై ఆమె ప్రియుడు వైరుతో మెడ బిగించి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాది వైఎస్సార్‌ కాలనీకి చెందిన ఆశ (27) మధురవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు తొమ్మిదేళ్ల క్రితం మేనమామతో వివాహం జరగగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వివాహానికి ముందే ఆమెకు మధురవాడ స్వతంత్య్రనగర్‌కు చెందిన కొయ్య కార్తీక్‌తో పరిచయం, ప్రేమ వ్యవహారం ఉంది. కార్తీక్‌కు కూడా వివాహం అయినప్పటికీ, వీరిద్దరూ తమ పాత పరిచయాన్ని కొనసాగిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.

వైరుతో మెడకు బిగించి..

మంగళవారం సాయంత్రం ఆశ తన ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో కార్తీక్‌ ఆమెకు ఫోన్‌ చేసి, బయటకు వెళ్దామని నమ్మబలికాడు. అనంతరం ఆమెను మారికవలస నుంచి కాపులుప్పాడ మీదుగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కార్తీక్‌ పక్కనే పడి ఉన్న ఓ వైరును తీసుకుని ఆమె మెడకు గట్టిగా బిగించాడు. ఊపిరాడక ఆశ స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన కార్తీక్‌, అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో పలువురు వాకర్స్‌, కొన ఊపిరితో పడి ఉన్న ఆశను గమనించారు. వెంటనే వారు భీమిలి పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వెంటనే రుషికొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు కార్తీక్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement