బ్లాక్ లిస్టులో ఉన్నా ‘రాజ’భోగం అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో చెలరేగిపోతున్న కాంట్రాక్టర్ నిబంధనలు గాల్లోకి.. బెదిరింపులకు తలొగ్గిన అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయని యంత్రాలు.. సగం వాహనాలకు ఇంజన్లే లేవు ఏడాదిన్నరగా ‘నెలవారీ’ నాటకం.. ఇప్పుడు ఏకంగా ఏడాది కాంట్రాక్ట్
జీవీఎంసీ నిధుల
స్వీపింగ్ యంత్రాలు రోడ్లను శుభ్రం చేస్తున్నాయో లేదో తెలియదు కానీ జీవీఎంసీ నిధులను మాత్రం ‘స్వీప్’ చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్వహణలో తీవ్ర లోపాలు, అధికారులకు బెదిరింపులు, మరో నగరంలో బ్లాక్‌లిస్టు వివాదం.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకే ఇప్పుడు జీవీఎంసీలో ‘ఏడాది’ టెండర్ కట్టబెట్టే ప్రయత్నాలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
అధికార పార్టీ అండదండలు ఉంటే చాలు.. నిబంధనలు బూడిదలో పోసిన పన్నీరే. సదరు సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్నా సరే.. పనులు సరిగ్గా చేయడం లేదని స్వయంగా నోటీసులు ఇచ్చినా సరే.. చివరికి బాధ్యత గల ప్రభుత్వ ఇంజనీర్లను నడిరోడ్డుపై బెదిరించినా సరే.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి జీవీఎంసీ అధికారులు రెడీ అయిపోయారు. గ్రేటర్ విశాఖ నిధులను క్లీన్‌గా ‘స్వీపింగ్’కు తెరవెనుక భారీ స్కెచ్ పూర్తయింది. ఒక పక్క విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అవినీతి మార్కును గుర్తించి సదరు సంస్థను బ్లాక్ లిస్టులో పెడితే.. విశాఖ అధికారులు మాత్రం అదే సంస్థకు ‘రాజ’మర్యాదలు చేస్తూ టెండర్లు కట్టబెడుతుండటం నగరంలో సంచలనంగా మారింది.
ఆయిల్, నిర్వహణ లేదు కానీ బెదిరింపులు
ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అయిన శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధి రాకేష్ చౌదరి ఆగడాలు జీవీఎంసీలో మిన్నంటాయి. ఒప్పందం ప్రకారం రోడ్డుపై స్వీపింగ్ చేసేటప్పుడు హెల్పర్లు ఉండాలి.. కానీ లేరు. యంత్రాలు కనీసం 8 గంటలు తిరగాలి.. కానీ తిప్పడం లేదు. పైగా యంత్రాలకు కనీసం హైడ్రాలిక్ ఆయిల్ లేదు, గ్రీజు పెట్టే నాథుడే లేడు. వాటర్ స్ప్రింక్లర్లు, రబ్బర్లు పాడైపోవడంతో ఈ యంత్రాలు రోడ్లను శుభ్రం చేయకపోగా.. దుమ్మును గాల్లోకి లేపుతూ నగరాన్ని మరింత కాలుష్యమయం చేస్తున్నాయి. దీనిపై నిలదీస్తూ, నిబంధనల ప్రకారం పనిచేయాలని జోన్–3 ఇన్‌చార్జ్ ఏఈ ప్రసాద్ గత నవంబర్‌లో నోటీసులు జారీ చేశారు. అంతే.. సదరు కాంట్రాక్టర్ అహంకారం నషాళానికి అంటింది. ‘మాకే నోటీసులు ఇస్తావా? నీకెంత ధైర్యం? ఆఫీసుకి వచ్చి నీ సంగతి తేలుస్తా’.. అంటూ ఏకంగా ప్రభుత్వ అధికారిపైనే రాకేష్ చౌదరి ఫోన్‌లో రంకెలు వేశాడు. అంతటితో ఆగకుండా, పనులను ఇష్టానుసారంగా నిలిపివేసి బ్లాక్ మెయిలింగ్ రాజకీయం నడిపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత జరిగినా సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ చేయగానే వణికిపోయారు. చట్టాన్ని పక్కనపెట్టి, సదరు సంస్థకు ‘జీహుజూర్’ అంటూ మోకరిల్లారు.
ఆ సంస్థది ఘనచరిత్రే..
ఈ రాజరాజేశ్వరి సంస్థ ఘనచరిత్ర ఈనాటిది కాదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో (2017లో) స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏకంగా రూ. 41 కోట్లు వెచ్చించి 125 స్వీపింగ్ వాహనాలను ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. సగానికి పైగా వాహనాలకు అసలు ఇంజన్లే లేవు. ఇంజన్లు లేని వాహనాలను రవాణా శాఖ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుంది? అందుకే ఇన్నేళ్లయినా రాష్ట్రంలోని ఏ మునిసిపాలిటీలోనూ వీటికి రిజిస్ట్రేషన్ కాలేదు. అయినా సరే అప్పట్లోనే ఈ సంస్థకు కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించేశారు. ఇలాంటి ఘనచరిత్ర, క్రిమినల్ రికార్డు ఉన్న సంస్థకే ఇప్పుడు మళ్లీ విశాఖలో స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు పనులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
నెల టెండర్ల ‘ఆట..’ ఇప్పుడు ఏడాది ఒప్పందమా?
నిజానికి 3, 6 సీఎంటీ స్వీపింగ్ యంత్రాలకు సంబంధించి ఏడాది పాటు టెండర్లు పిలవాలని గతేడాది ఆగస్టు 28నే జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కానీ, అధికారులు మాత్రం ఏడాది కాలానికి టెండర్లు పిలవకుండా కాలయాపన చేశారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంది. శాశ్వత టెండర్లు పిలిస్తే వేరే వాళ్లు వస్తారనే భయంతో.. గత ఏడాదిన్నరగా నెల రోజుల ప్రాతిపదికన టెండర్లు ఇస్తూ రాజరాజేశ్వరి సంస్థకు దోచిపెడుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి టెండర్లను కూడా సర్వత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న, బ్లాక్ లిస్టులో ఉన్న సదరు వివాదాస్పద సంస్థకే అప్పగించేలా అధికారులు ఫైళ్లు సిద్ధం చేసేశారు. నగర ప్రజల ఆరోగ్యం, జీవీఎంసీ ఖజానా కంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడే పరమావధిగా భావిస్తున్న కొందరు అధికారుల తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


