వీఎంఆర్‌డీఏలో పొలిటికల్ ‘ప్లానింగ్’ మాస్టర్ ప్లాన్ మార్చలేదని సీయూపీపై వేటు! నిబంధనలకు తలొగ్గని అధికారిణిపై బదిలీ అస్త్రం కూటమి రియల్ దందా కోసం బృహత్తర ప్రణాళికలో మార్పులకు ఒత్తిడి సీయూపీ శిల్పను ఏపీసీఆర్‌డీఏకు బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో దివ్యలత నియామకం
విశాఖ సిటీ: మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు ససేమిరా అన్నందుకు మహిళా అధికారిని ఇక్కడి నుంచి సాగనంపేశారు. రోడ్ల అలైన్‌మెంట్ మార్చలేదని.. ఆమె సీటునే మార్చేశారు. విశాఖ అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఇప్పుడు రాజకీయ కక్షలకు వేదికగా మారిపోయింది. కూటమి నేతల వ్యక్తిగత లాభాల కోసం అధికారులను బలిపశువులను చేయడం సర్వసాధారణమైపోయింది. తాజాగా వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక–2041లో మార్పులు, చేర్పులకు అంగీకరించలేదన్న కోపంతో చీఫ్ అర్బన్ ప్లానర్ (సీయూపీ) వి.శిల్పపై బదిలీ వేటు పడింది. ఈ పరిణామం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఒత్తిళ్లకు తలొగ్గని ఫలితం : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే మాస్టర్‌ప్లాన్–2041 శాసీ్త్రయంగా రూపొందించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల రియల్ దందాకు అనుగుణంగా ప్లాన్‌లో మార్పులు చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం బృహత్తర ప్రణాళిక పునఃపరిశీలన పేరుతో మూడు నెలల పాటు హడావుడి చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నామని చెప్పినప్పటికీ, వచ్చిన ఫిర్యాదుల్లో మెజార్టీ వాటా కూటమి నాయకులవే ఉండటం గమనార్హం. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు లబ్ధి చేకూరేలా, సొంత భూముల విలువ పెరిగేలా రోడ్ల అమరికను మార్చాలని ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప ఈ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన తర్వాత, నిబంధనల ప్రకారం భారీ మార్పులు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు సమాచారం. రోడ్ల అలైన్‌మెంట్ మార్చడం వల్ల భవిష్యత్తులో నగర ప్రణాళిక దెబ్బతింటుందని, స్వల్ప మార్పులకు మాత్రమే అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకుంటేనే తమ పప్పులు ఉడుకుతాయని భావించిన నేతలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆమెను బదిలీ చేయించడంలో సఫలమయ్యారు.
ముందస్తు వ్యూహం ప్రకారమే బదిలీ
వారం రోజులుగా వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో శిల్ప బదిలీపై ఊహాగానాలు జోరుగా సాగాయి. కూటమి నేతలు చెప్పినట్లు వినే వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలని పెద్దలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శిల్పను అమరావతిలోని సీఆర్‌డీఏ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ప్రస్తుతం ఏపీసీఆర్‌డీఏ ప్లానింగ్ వింగ్‌లో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న కె.దివ్యలతను డిప్యూటేషన్‌పై వీఎంఆర్‌డీఏ సీయూపీగా నియమించారు.
అసంతృప్తిలో
అధికార యంత్రాంగం ?
గత వారం రోజులుగా వీఎంఆర్‌డీఏ చెలరేగిన వార్తలకు అనుగుణంగా బదిలీ ఉత్తర్వులు రావడంతో కూటమి ప్రభుత్వంపై అధికారుల్లో అసంతృప్తి రేగినట్లు తెలుస్తోంది. నేతలు, ప్రజాప్రతినిధుల స్వప్రయోజనాల కోసం అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడంపై రగిలిపోతున్నారు. విశాఖ నగరాభివృద్ధిని పణంగా పెట్టి, వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవాలని చూస్తున్న కూటమి తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీల పర్వం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? మాస్టర్ ప్లాన్‌లో జరగబోయే మార్పులతో ఎవరికి లబ్ధి చేకూరనుంది? అనే అంశాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.


