అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

కూటమికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సవాల్‌ క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు సిద్ధహస్తుడు గూగుల్‌ డేటా సెంటర్‌కు బీజం వేసింది జగనే బాబుది కేవలం ‘రిబ్బన్‌ కటింగ్‌’ మాత్రమే

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కూటమి నాయకులకు సవాల్‌ విసిరారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలోనే బీజం పడినవని స్పష్టం చేశారు. తర్లువాడలో శంకుస్థాపన చేసిన అదానీ–గూగుల్‌ డేటా సెంటర్‌ గత ప్రభుత్వ కృషి ఫలితమేనని, అప్పట్లో దీనిని వ్యతిరేకిస్తూ వార్తలు రాసిన టీడీపీ అనుకూల పత్రికలే ఇప్పుడు సాక్ష్యాలని పేర్కొన్నారు. 2020లోనే ఈ ప్రాజెక్టు కోసం 130 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, సింగపూర్‌ నుంచి సబ్‌సీ కేబుల్‌ ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం నాటి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. జగన్‌ హయాంలో జరిగిన జీఐఎస్‌ సదస్సు ద్వారా వచ్చిన రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే నేడు ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌, రెన్యూ ఎనర్జీ వంటి ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయని వివరించారు.

క్రెడిట్‌ చోరీలో బాబు సిద్ధహస్తుడు

చంద్రబాబు నాయుడు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని విమర్శిస్తూ, గతంలోనే ప్రారంభమైన ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని, సిద్ధంగా ఉన్న వీఎంఆర్డీఏ డెక్‌ బిల్డింగ్‌ను ఇప్పుడు రిబ్బన్‌ కటింగ్‌ చేయడం సిగ్గుచేటని కేకే రాజు మండిపడ్డారు. రైల్వే జోన్‌ తాత్కాలిక కార్యాలయం ఇప్పటికే ఆ బిల్డింగ్‌లో కొనసాగుతుంటే, దానికి ఇప్పుడు కొత్తగా ప్రారంభోత్సవం చేయడం ఏంటని ప్రశ్నించారు. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులు కూడా జగన్‌ కష్టంతోనే సాకారమయ్యాయని, వాటిని తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు చూడటం హాస్యాస్పదమన్నారు. లోకేష్‌ తన ప్రసంగాల్లో ‘జి’ అంటే గొడ్డలి అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ, విశాఖలో ‘వి’ అంటే వైఎస్సార్‌ సీపీకి ఉన్న విశ్వసనీయత అని, టీడీపీకి అది వెన్నుపోటు అని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌ సొంత శాఖలోని అక్రమాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.

రాష్ట్ర గౌరవానికి భంగం

పారిశ్రామిక వేదికలను రాజకీయ ప్రసంగాలకు వాడుకోవడం రాష్ట్ర గౌరవానికి భంగకరమని కేకే రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పరిశ్రమ ప్రారంభోత్సవం జరిగినప్పుడు దానివల్ల వచ్చే ఉద్యోగాలు, రాష్ట్రానికి కలిగే లాభాల గురించి మాట్లాడాల్సింది పోయి, కేవలం రాజకీయ ప్రత్యర్థులను దూషించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల అనుభవం ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం విచారకరమన్నారు. కేవలం తమ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని తమదిగా ప్రచారం చేసుకుంటూ తండ్రీకొడుకులు రాష్ట్ర పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, పరిశీలకులు సతీష్‌వర్మ, మాజీ డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement