మహారాణిపేట: నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు అపోహలకు లోనుకాకుండా ఉండాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. ‘కలెక్టర్ గారూ ఇదీ క్షేత్ర సాయి తీరు’శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో జిల్లా అధికార యంత్రంగా నగరంలో పలు పెట్రల్ బంకులను పరిశీలించింది. బుధవారం కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్వయంగా రామాటాకీస్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకును సందర్శించి, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 123 బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్లే బంకుల వద్ద రద్దీ పెరుగుతోందని, ప్రజలు ఎప్పుడు అవసరమైతే అప్పుడే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలమాంబ ఆలయం వద్ద ఉన్న పెట్రోల్ బంకును జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తనిఖీ చేశారు. అక్కడ ఆటో డ్రైవర్లు, వినియోగదారులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కరరావు, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు.


