సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో వెంకటరావు తెలిపారు. బుధవారం పోలీసు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం అన్ని ఆర్జిత సేవలతో పాటు, గురువారం నుంచి మే 1 వరకు అంతరాలయ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి వైదిక కార్యక్రమాలు, రెండో విడత చందన సమర్పణ ఉంటాయని, ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వెల్లడించారు. వరాహ పుష్కరిణి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


