విచారణకు అధికారి నియామకం
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం సర్వే నంబర్ 6లోని పాండ్రంగి వేణుగోపాలస్వామికి చెందిన 22.70 ఎకరాల భూమిలో అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆనందపురం, పద్మనాభం మండలాల భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ‘దేవదాయ భూమిలో రియల్ రోడ్డు’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ప్రజలతో పాటు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. సాక్షాత్తు స్వామి వారికే సున్నం రాసి, రియల్ వ్యాపారులకు అమ్ముడుపోయిన కార్యనిర్వహణాధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ అధికారే ఇప్పుడు రియల్ వ్యాపారులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ అధికారి పాత్రతో పాటు రోడ్డు నిర్మాణం చేపట్టిన వారిపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ మరో అధికారిని నియమించింది. దీనిపై ప్రస్తుత ఈవో పి.ఎల్.ఎన్.రాజును వివరణ కోరగా.. తనకు ఆరోగ్యం బాగాలేక నాలుగు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. గత డిసెంబరులోనూ ఇదే విధంగా భూమిని ఆక్రమించి రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని, ఇప్పుడు నిర్మించిన రోడ్డును త్వరలోనే పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. కేవలం వేణుగోపాలస్వామి భూములే కాకుండా, భీమిలిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన చిట్టివలసలోని భూములు, సంగివలస కొత్తమ్మ ఆలయ పరిధిలోని లంగర్‌ఖానా భూములు కూడా వరుసగా ఆక్రమణలకు గురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆక్రమణలను అడ్డుకోవాలని ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు.


