నలుగురు మహిళలు, ఇద్దరు మైనర్ల అరెస్టు
గాజువాక: బీసీరోడ్డు సంజీవ్‌కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో కాంక్రీట్ బ్రేకర్ మెషిన్, వాటర్ పంప్ మోటార్‌ను దొంగిలించిన కేసులో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలను గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేశారు. క్రైం ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాలివి.. పంతులుగారి మేడ ప్రాంతానికి చెందిన విశ్వనాథ వెంకటేశ్వరరావుకు సంజీవ్ కాలనీలో తన పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇల్లు ఉపయోగంలో లేకపోవడంతో తాళం వేసి ఖాళీగా ఉంచారు. ఈ నెల 23న ఆయన వెళ్లి చూడగా.. ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో పాటు లోపల ఉన్న కాంక్రీట్ బ్రేకర్ మెషిన్, వాటర్ పంప్ మోటార్ దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. దీనిపై ఆయన గాజువాక క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. ఈ క్రమంలో వై జంక్షన్ వద్ద ఉన్న తుప్పల్లో నిందితులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో వాడపల్లి నిర్మల, పెండ్ర ఎర్రమ్మ, పెండ్ర లత, గుల్ల సునీతతో పాటు ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నీటి పంపు మోటార్, టూల్‌కిట్ బాక్సుతో కూడిన కాంక్రీట్ బ్రేకర్ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా బీసీ రోడ్డులోని గిరిజా కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నలుగురు మహిళలను రిమాండ్‌కు తరలించగా, ఇద్దరు బాలికలను జువనైల్ హోమ్‌కు పంపినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


