కలెక్టర్‌ గారూ.. ఇదీ క్షేత్రస్థాయి తీరు... | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారూ.. ఇదీ క్షేత్రస్థాయి తీరు...

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

మహారాణిపేట: నగరంలో కొద్ది రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కోసం సామాన్యులు పడుతున్న అవస్థలు అక్షరాలా కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి క్యూ కడితేనే కానీ చుక్క పెట్రోల్‌ దొరకని దయనీయ స్థితి నెలకొంది. మధురవాడ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల వరకు వాహనచోదకుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. గంటల తరబడి పడిగాపులు కాసినా, చివరకు వాహనంలోకి వచ్చేది కేవలం రూ.300 పెట్రోల్‌ మాత్రమే కావడంతో అసహనం, ఆందోళన వారిని వెంటాడుతున్నాయి. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య నెలకొన్న వైరుధ్యం ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. జిల్లాలో పెట్రోల్‌ కొరత లేదని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ స్పష్టం చేసినప్పటికీ, బంకుల వద్ద దర్శనమిస్తున్న ‘నో స్టాక్‌’ బోర్డులు ఆ ప్రకటనను అపహాస్యం చేస్తున్నాయి. అధికారులు చెబుతున్న మాటలకు, బంకుల్లో పడుతున్న క్యూలకు అస్సలు పొంతన లేకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అధికారుల ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమా, లేక సరఫరా వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందా అన్నది అర్థం కాక జనం అయోమయంలో ఉన్నారు.

సిబ్బంది నిర్లక్ష్యం

వాస్తవానికి పెట్రోల్‌ బంకుల నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యం కూడా ప్రజల ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని బంకులో ఆరు పంపులు అందుబాటులో ఉన్నా, వాటిలో కేవలం రెండింటిని మాత్రమే వినియోగించడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. ఉన్న వనరులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా, వాహనదారులను క్యూలలో గంటల తరబడి నిలబెట్టడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీని నియంత్రించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కార్యరూపం దాల్చడం లేదు.

ఒకవైపు గంటల తరబడి వేచి చూసే ఓపిక లేక, మరోవైపు లభిస్తున్న పెట్రోల్‌ కూడా తక్కువ పరిమాణంలో ఉండటంతో వాహనదారులు విసిగిపోతున్నారు. అసలు ఎప్పటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందో, ఎప్పుడు పూర్తిస్థాయిలో పెట్రోల్‌ దొరుకుతుందో చెప్పేవారే కరువయ్యారు. అధికారుల ప్రకటనల కంటే, బంకుల వద్ద ఉన్న బోర్డులే వాస్తవమని ప్రజలు నమ్ముతున్న తరుణంలో, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాటలతో సరిపెట్టకుండా, బంకుల వద్ద పర్యవేక్షణ పెంచి ప్రజల ఇబ్బందులను తొలగించడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం.

పెట్రోల్‌,డీజిల్‌ కొరత లేదు

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 120 పెట్రోల్‌ బంకుల్లో ఇంధన సరఫరా సాధారణంగానే జరుగుతోందని ఆయన తెలిపారు. పుకార్ల కారణంగా కొందరు వినియోగదారులు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తుండటంతోనే కొన్ని చోట్ల తాత్కాలిక రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఉదయం వేళల్లో నిల్వలు స్వల్పంగా తగ్గినప్పటికీ, అదే రోజున తగినంత సరఫరా అందుబాటులోకి వస్తోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు.

పెదవాల్తేరు పెట్రోల్‌ బంక్‌

ప్రస్తుత నిల్వలు

కంపెనీ పేరు బంకుల పెట్రోల్‌ నిల్వలు డీజిల్‌ నిల్వలు

సంఖ్య (కిలో లీటర్లలో) (కిలో లీటర్లలో)

హెచ్‌పీసీఎల్‌ 42 981 903

బీపీసీఎల్‌ 39 647 980

ఐవోసీ 39 572 794

మొత్తం 120 2200 2677

Advertisement
 
Advertisement
Advertisement