ముచ్చటపడి రాలేదు.. మూటగట్టి తెచ్చారు.. | - | Sakshi
Sakshi News home page

ముచ్చటపడి రాలేదు.. మూటగట్టి తెచ్చారు..

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

గూగుల్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపనకు బలవంతపు జనసమీకరణ

ఏయూ నుంచి మూడు బస్సుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల తరలింపు

చదువు పక్కనపెట్టి..

ఎండలో ఆనందపురానికి బాట

విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం తన ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థులను విడిచిపెట్టడం లేదు. ఆనందపురంలో మంగళవారం జరిగిన గూగుల్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమం జనసమీకరణకు యూత్‌ కలరింగ్‌ ఇచ్చేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ‘గూగుల్‌’ శంకుస్థాపనకు వచ్చినట్లు ప్రచా రం చేసుకోడానికి సాక్షాత్తు ఆంధ్రా యూనివర్సిటీనే ‘జనసమీకరణ’ కేంద్రంగా మార్చేసింది. ఇందుకోసం ఏయూ అధికారులను పావులుగా వాడుకుంది. విద్యార్థులను బలవంతంగా తరలించే బాధ్యతలను అప్పగించింది. గీతం విద్యార్థులను తరలించారు.

విద్యార్థులంటే ‘క్రౌడ్‌’ ఫిల్లింగ్‌ మెటీరియలా?

ముఖ్యమంత్రి శంకుస్థాపన చూసేందుకు యువత విపరీతంగా ఆసక్తి చూపిస్తోందని ప్రజలను నమ్మించడం కోసం ప్రభుత్వం పక్కా వ్యూహం రచించింది. గూగుల్‌ వస్తోందన్న ఆనందంతో యువత, విద్యా ర్థులు తండోపతండాలుగా తరలివచ్చారని కలరింగ్‌ ఇవ్వడం కోసం ప్రయత్నించింది. ఈ బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఏయూ అధికారులు తమ విధేయతను చాటుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం.. అధికారులు హడావుడిగా రంగంలోకి దిగారు. క్లాసులు పక్కనపెట్టేసి మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేశారు. ఏయూ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులను ఆ బస్సుల్లో ఎక్కించి ఆనందపురానికి తీసుకువెళ్లారు. విద్యార్థులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కంప్యూటర్ల ముందు కోడింగ్‌ నేర్చుకోవాల్సిన విద్యార్థులు, ఈ ఎండలో రాజకీయ ఉపన్యాసాలు వినాల్సి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement