డిజిటల్‌ ప్రయాణంలో నూతన అధ్యాయం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ప్రయాణంలో నూతన అధ్యాయం

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

‘భారత్‌ ఏఐ శక్తి’ కాంక్లేవ్‌లో లోకేష్‌

మహారాణిపేట: భారతదేశ డిజిటల్‌ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని, మన రాష్ట్రానికి ఇది కీలక మలుపు అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ‘భారతదేశ ఏఐ కారిడార్‌ను ఉమ్మడిగా నిర్మించడం’అనే అంశంపై గూగుల్‌ ఆధ్వర్యంలో నోవాటెల్‌లో మంగళవారం జరిగిన ‘భారత్‌ ఏఐ శక్తి కాంక్లేవ్‌’లో ఆయన మాట్లాడారు. ‘విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ప్రారంభం కావడం కేవలం ఒక ఆరంభం మాత్రమే కాదు, దేశ డిజిటల్‌ ప్రయాణంలో ఇదొక చారిత్రక ఘట్టం. నేడు మనం విశాఖ పునాదులను ఏఐ విప్లవంపై నిర్మించబోతున్నాం. విశాఖ నగరం మన దేశ భవిష్యత్తును నిర్మించబోతోందని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని తెలిపారు. 2047 నాటికి విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం కృత్రిమ మేధ, క్లీన్‌ ఎనర్జీ, మెడికల్‌ తయారీ, అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు కేంద్రంగా మారబోతోందని లోకేష్‌ అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమని, ఏపీతో పాటు వైజాగ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో గూగుల్‌ క్లౌడ్‌, గూగుల్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాష్‌ కోలే, 49 కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement