విద్యా మార్పిడి, ఉపాధిపై దృష్టి
మద్దిలపాలెం: ప్రముఖ జపనీస్ కంపెనీల్లో విద్యార్థులకు నియామక అవకాశాలు కల్పించడంపై చర్చించేందుకు జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో)కు చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని సందర్శించింది. పరిశోధన, అధ్యాపకుల మార్పిడి, విద్యార్థుల రాకపోకలు వంటి అంశాల్లో పటిష్టమైన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఏయూ అధ్యాపకులు జపాన్‌లోని తోయామా ప్రిఫెక్చర్‌ను సందర్శించే అవకాశాలను కూడా జెట్రో ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. ద్వైపాక్షిక విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి ఉమ్మడి అంతర్జాతీయ సదస్సులను నిర్వహించడం, జపాన్ విద్యార్థులను ఉన్నత విద్య కోసం ఏయూలోకి ఆహ్వానించడం(సాధ్యమైతే ఫీజు మినహాయింపుతో), ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో జపనీస్ భాషా తరగతులను ప్రారంభించడం వంటి అంశాల ఆవశ్యకతను వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ వారికి వివరించారు. పరస్పర విద్యా, వృత్తిపరమైన అభివృద్ధి కోసం జపాన్‌తో భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని వీసీ పేర్కొన్నారు.


